అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ వరస చర్యలు ప్రపంచ వ్యాప్తంగా ఉద్రిక్తలకు కారణం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆయన వెనుజువెలా పై దాడి చేసి ..ఆ దేశ ప్రెసిడెంట్ నికోలస్ మదురో, ఆయన భార్యను బలవంతంగా పట్టుకొచ్చిన సంగతి తెలిసిందే. అక్రమంగా అమెరికా కు పెద్ద ఎత్తున డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు అనే కారణంతో ఈ పని చేసినట్లు చెపుతున్నా కూడా అసలు విషయం వేరే ఉంది అన్నది బహిరంగ రహస్యమే. వెనుజువెలా లోని చమురు నిక్షేపాలు టార్గెట్ గా డోనాల్డ్ ట్రంప్ ఆ పని చేశారు. ఇప్పుడు ఆయన ఒక వైపు గ్రీన్ ల్యాండ్ ను తమ వశం చేసుకుంటామని..దీనికి అవసరం అయితే సైనిక చర్యకు కూడా వెనకాడం అని ప్రకటించారు. ఇప్పుడు నేరుగా రష్యాతో కయ్యాయనికి కాలుదువ్వున్నట్లు కనిపిస్తోంది. రష్యా-యుక్రెయిన్ ల మధ్య యుద్ధం ఆపేందుకు డోనాల్డ్ ట్రంప్ చేసిన ప్రయత్నాలు ఏవీ కూడా ఫలించలేదు.
ఇప్పుడు ఆ దిశగా మరిన్ని కఠిన చర్యలకు సిద్ధం అవుతున్నట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. అందులో భాగంగానే అమెరికా దూకుడు ప్రదరిస్తోంది. అయితే రష్యా కూడా ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా అగ్రరాజ్యం అమెరికా కు హెచ్చరికలు జారీ చేస్తోంది. తాజాగా రష్యా జెండాతో ఉన్న వెనెజువెలా ఆయిల్ షిప్‌ను అమెరికా సీజ్ చేయటంపై రష్యా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అమెరికా చర్యతో ఉత్తర అట్లాంటిక్ మహా సముద్రంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి అనే చెప్పాలి. రష్యా ప్రభుత్వానికి చెందిన నేత అలెక్సీ జురావ్లెవ్ ఈ సంఘటనపై స్పందిస్తూ.. ‘అగ్రరాజ్యం అతి విశ్వాసంతో వ్యవహరిస్తోంది అని, అంతర్జాతీయ చట్టాలను ఇలాగే ఉల్లంఘిస్తే మిలటరీ దాడులు ఎదుర్కోవడానికి అమెరికా సిద్ధంగా ఉండాలి అన్నారు. టార్పిడోలతో దాడులు చేయటం అమెరికా కోస్ట్ గార్డ్ షిప్‌లను ముంచేయటం వంటివి చేయాల్సి వస్తుంది అంటూ గట్టిగా హెచ్చరించారు. రష్యాకు చెందిన భారీ చమురు ట్యాంకర్ ‘మరినెరా’తో పాటు సోఫియా పేరిట ఉన్న మరో ట్యాంకర్‌ను అమెరికా తీరప్రాంత గస్తీ దళం బుధవారం తమ నియంత్రణలోకి తీసుకుంది.
ఉత్తర అట్లాంటిక్ సముద్ర ప్రాంతంలో ఐస్‌ల్యాండ్, యూకే మధ్య నుంచి ప్రయాణిస్తున్న ‘మరినెరా’పై అమెరికా కోస్ట్‌గార్డు దళాలు హెలికాప్టర్లలో దిగి స్వాధీనంలోకి తీసుకున్నాయి. సోఫియా ట్యాంకర్ కరీబియన్ ప్రాంతంలో వెనెజువెలా వైపు ప్రయాణిస్తోంది. వెనెజువెలాపై ఆంక్షలు ఉన్నా కూడా ఆ దేశం నుంచి చమురు రవాణా చేస్తోందని, హెజ్బొల్లా ఉగ్రవాద గ్రూపుతో సంబంధమున్న కంపెనీకి కార్గోను అక్రమంగా రవాణా చేస్తోందని పేర్కొంటూ రష్యాకు చెందిన బెల్లా-1 నౌకపై అమెరికా నిషేధం విధించింది. ఇది ఉంటే ఇప్పటికే రష్యా నుంచి చమురు కొంటున్నారు అనే కారణంతో భారత్ పై గతంలో ఎన్నడూ లేనిరీతిలో ఏకంగా 50 శాతం సుంకాలు విధించిన అమెరికా ఇప్పుడు మరింత సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందనే కారణంతో భారత్‌పై ఏకంగా 500 శాతం సుంకాలు విధించేందుకు వీలుగా కీలక బిల్లుకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ విషయాన్ని రిపబ్లికన్ సెనెటర్ లిన్స్ గ్రాహం ఎక్స్‌లో పోస్ట్ పెట్టడం ద్వారా బహిర్గతం చేశారు.
ట్రంప్‌తో జరిగిన భేటీలో పలు కీలక విషయాల గురించి చర్చలు జరిపినట్టు తెలిపారు. రష్యాపై ఆంక్షలు విధించే బిల్లుకు అధ్యక్షుడు ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, ఈ బిల్లుపై వచ్చే వారమే ఓటింగ్ జరగనుందని వెల్లడించారు. ఉక్రెయిన్‌లో పుతిన్ చేస్తున్న దారుణాలకు రష్యా నుంచి చమురు కొనడం ద్వారా భారత్, చైనా, బ్రెజిల్ దేశాలు పరోక్షంగా మద్దతు ఇస్తున్నాయని గ్రాహం ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజా బిల్లు ప్రకారం ఆయా దేశాలపై 500 శాతం సుంకాలు విధించే అధికారం అమెరికాకు ఉంటుందని గ్రాహం తెలిపారు. ఈ బిల్లు ఆమోదం పొందితే రష్యా నుంచి ఇతర దేశాలు చమురు కొనడం తగ్గుతుందని లిన్స్ గ్రాహం ఆశాభావం వ్యక్తం చేశారు. రష్యా నుంచి చమురు కొంటున్న దేశాల్లో ప్రస్తుతం చైనా మొదటి స్థానంలోనూ, భారత్ రెండో స్థానంలోనూ ఉన్నాయి.