నాటు సారా మరణాల అంశంపై తెలుగుదేశం పార్టీ బుధవారం నాడు విజయవాడలో నిరసన ప్రదర్శనకు పిలుపునిచ్చింది. దీంతో పోలీసులు ఉదయం నుంచే టీడీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేయటంతోపాటు ఎక్కడి వారిని అక్కడ నిర్భందించారు. గత కొంత కాలంగా ఏపీలో నాటుసారాతో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోవటంతో టీడీపీ ఇదే అంశంపై ఎక్సైజ్ శాఖ కార్యాలయాన్ని ముట్టడించాలని నిర్ణయించింది. అయితే ప్రభుత్వం మాత్రం ఇవి నాటు సారా మరణాలు కావని..సహజ మరణాలని చెబుతోంది. తెలుగుదేశం పార్టీ సహజ మరణాలను రాజకీయం చేస్తోందని ఆరోపిస్తోంది. మరో విశేషం ఏమిటంటే సీఎం జగన్ అసెంబ్లీ వేదికగా జంగారెడ్డి గూడెం వంటి ప్రాంతాల్లో నాటు సారా కాయటం ఎలా సాధ్యం అవుతుందని ప్రశ్నించారు.
అది జరిగిన వెంటనే ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం అధికారులు దాడులు చేసి పలు ప్రాంతాల్లో నాటు సారా బట్టీలను భారీ ఎత్తున ధ్వంసం చేశారు. అంతే కాదు.. ఈ డేటాను కూడా విడుదల చేశారు. ఇది వైసీపీ సర్కారును చిక్కుల్లో పడేసిందనే చెప్పొచ్చు. ఈ తరుణంలో బుధవారం నాడు ఏపీ టీడీపీ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడుతోపాటు ఎమ్మెల్యేలు పయ్యావుల కేశవ్, రామానాయుడు, గద్దె రామ్మోహన్, నిమ్మకాయల చినరాజప్ప, ఆదిరెడ్డి భవానీ, బెందాళం అశోక్ తదితరులు నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. ఎక్సైజ్ శాఖ అధికారులకు ఒకరిద్దరు ఎమ్మెల్యేలు వెళ్లి వినతిపత్రం అందజేస్తామన్నా కూడా పోలీసు అధికారులు అడ్డుకుని అరెస్ట్ చేశారు.