తెలంగాణ కాంగ్రెస్ కొత్త నినాదం అందుకుంది. రాష్ట్రంలో ఇక నుంచి 'ఇస్తవా..చస్తవా' పేరుతో ఉద్యమం కొనసాగిస్తామని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ప్రకటించారు. కెసీఆర్ ఏదైనా కొత్త పథకం ప్రవేశం పెట్టాలంటే ఉప ఎన్నిక రావాల్సిందేనని ఎద్దేవా చేశారు. ఆయనకు దళితులపై ప్రేమలేదని..ఉప ఎన్నికల్లో రాజకీయ ప్రయోజనం కోసమే దళితబంధును తెరపైకి తెచ్చారన్నారు. పథకాలు రావాలంటే ఉప ఎన్నికలు రావాలన్నట్లు ఉందన్నారు. అందుకే టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను రాజీనామా చేయాలంటున్నాని తెలిపారు. సెప్టెంబర్‌లో రాహుల్ తెలంగాణలో పర్యటిస్తారని చెప్పారు. సోమవారం నాటి ఇంద్రవెల్లి సభను విజయవంతం చేస్తామని ప్రకటించారు.
ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి నివాసానికి షబ్బీర్ అలీతో కలసి వెళ్లిన రేవంత్ రెడ్డి సభ ఏర్పాట్ల గురించి చర్చించారు. తర్వాత రేవంత్ మీడియాతో మాట్లాడారు. ఆగస్టు 9 నుంచి సెప్టెంబర్ 17 వరకూ కార్యక్రమాలు ఉంటాయన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబానికి పది లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మరో నాలుగైదు ప్రాంతాల్లో ఇంద్రవెల్లి లాంటి సభలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఇలాంటి సభల ద్వారా తమ సంప్రదాయ ఓటు బ్యాంకు పక్కదారి పట్టకుండా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తోంది.