తెలంగాణ రాజకీయం అంతా ఇప్పుడు రైతుల చుట్టూనే తిరగుతుంది. అధికార టీఆర్ఎస్ దగ్గర నుంచి ప్రతిపక్ష పార్టీలు అయిన కాంగ్రెస్, బిజెపిలు కూడా ఇదే అంశంపై ఉద్యమాలకు శ్రీకారం చుట్టాయి. ధాన్యం కొనుగోలు అంశం ఇంత కాలం టీఆర్ఎస్ వర్సెస్ బిజెపిలాగా సాగితే కాంగ్రెస్ కూడా దూకుడు పెంచింది. గురువారం నాడు నగరంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ సాగింది. ఇందులో టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డితోపాటు సీనియర్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు , దామోదర్ రాజనర్సింహ, సీతక్క తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర సర్కార్‌లు జేఏసీగా ఏర్పడి రైతులను మోసం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. పండించిన పంటకు గిట్టబాటు ధర కల్పించాలని కోరుతున్నామని తెలిపారు. సీఎం కేసీఆర్, ఇందిరాపార్క్ దగ్గర ఏసీలతో ధర్నాలు, దీక్షలు చేస్తారా..? అని ప్రశ్నించారు. రైతుల పక్షాన పోరాటం చేయాలంటే.. రైతుల కళ్లాల దగ్గరకు వెళ్ళాలన్నారు. లేదంటే చనిపోయిన రైతు కుటుంబాలను పరామర్శించాలన్నారు. బీజేపీ నేత బండి సంజయ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి మోదీని నిలదీయాలని డిమాండ్ చేశారు. 19వ తేదీ నుంచి 23 వరకు కళ్లాల్లోకి కాంగ్రెస్ ఉద్యమం చేస్తుందని ప్రకటించారు.
ఈ నెల 23 వరకు కేసీఆర్‌కు సమయం ఇస్తున్నామని, తర్వాత రైతులతో కలిసి ప్రగతిభవన్ ముట్టడిస్తామని రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. బిజెపి, టీఆర్ఎస్ లు రైతుల పేరు చెప్పి యాక్షన్లు చేస్తున్నాయని విమర్శించారు. శుక్రవారం నాడు కామారెడ్డి జిల్లాలో షబ్బీర్ అలీతో కలసి రైతుల కష్టాలు తెలుసుకునే కార్యక్రమంలో పాల్గొననున్నట్లు తెలిపారు. ఇతర నాయకులు కూడా జిల్లాల్లో రైతులు కుప్పల మీద ఉండి సమస్యలు ఎదుర్కొంటున్నారో వారిని అడిగి సమస్యలు తెలుసుకుంటారన్నారు. వరి ధాన్యం కొనుగోలు విషయంలో గతంలో ఎన్నడూ రాని సమస్యలు ఇప్పుడే ఎందుకు వస్తున్నాయని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ప్రశ్నించారు. రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేయాల్సిన ప్రభుత్వమే ధర్నా చేయటం ఏమిటని ఎద్దేవా చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులతో ఆడుకుంటున్నాయని ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు నెపం నెట్టుకుంటూ రైతులకు అన్యాయం చేస్తున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. సీఎం కెసీఆర్ ది దొంగ దీక్ష అని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క విమర్శించారు.