తెలంగాణ మున్సిపల్, ఐటి శాఖల మంత్రి కెటీఆర్ పై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ నాయకత్వంలో గ్రేటర్ చుట్టూ రియల్ ఎస్టేట్ మాఫియా తయారైందని ఆరోపించారు. కరోనా కాలంలో మంత్రి కేటీఆర్ ఆయన మిత్రులతో కలిసి జీవో 111 పరిధిలోని రైతులను బెదిరించి వందలాది ఎకరాల వ్యవసాయ భూములను రాత్రి రాత్రికే చదును చేస్తున్నారన్నారే. భూ ఆక్రమణలపై కాంగ్రెస్ పార్టీ నిజ నిర్థారణ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త పర్యటనకు శ్రీకారం చుడతామని తెలిపారు. రేవంత్ రెడ్డి గురువారం నాడు కాంగ్రెస్ నేతలతో కలసి దేవరయాంజల్ లో సీతారామస్వామి భూ ఆక్రమణలను పరిశీలించారు. అక్కడే మీడియాతో మాట్లాడారు. 'ఐఏఎస్ కమిటీకి కేసీఆర్ బంధువుల అక్రమ నిర్మాణాలు కన్పించడం లేదా?. దేవరయాంజల్ మాన్యాలను ఆక్రమించిన మంత్రులు కేటీఆర్, మల్లారెడ్డి క్యాబినెట్ నుంచి తొలగించాలి.
గ్రేటర్ చుట్టు రియల్ ఎస్టేట్ మాఫియా. అక్రమ నిర్మాణాలపై మున్సిపల్, హెచ్ఎండిఎ కమిషనర్,రేరా ఛైర్మన్ స్పందించాలి' అని డిమాండ్ చేశారు. దేవరయాంజల్ లోని సీతారామ స్వామి ఆలయం మాన్యాలను ఆక్రమించి మంత్రులు కేటీఆర్, మల్లారెడ్డి భవనాలు, ఫామ్ హౌస్‌లు నిర్మిస్తే , అక్రమ భవనాలు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఐఏఎస్ కమిటీ బృందానికి ఎందుకు కన్పించడం లేదని ఎంపీ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ప్రభుత్వానికి దేవుడి భూములనూ పరిరక్షించాలనే చిత్తశుద్ది ఉంటే భూ ఆక్రమణలపై సిబిఐ చేత సమగ్ర విచారణ చేయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేసీఆర్ దగ్గరి బంధువు రఘునందన్‌రావు అధ్యక్షతన ప్రభుత్వం కమిటీ నియమించినప్పుడే కేసీఆర్ చిత్తశుద్ది ఏమిటో తెలుస్తుందన్నారు. గ్రేటర్ హైదరాబాద్ చుట్టు, హెచ్ఎండిఏ పరిధిలో వేలాది అక్‌టమ నిర్మాణాలకు మున్సిపల్ శాఖ మంత్రి, హెచ్ఎండిఎ,మున్సిపల్ కమిషనర్లు, రేరా ఛైర్మన్ సోమేష్ కుమార్ బాధ్యత వహించాలన్నారు.
దేవుడి మాన్యాలను ఆక్రమించిన మంత్రులు కేటీఆర్, మల్లారెడ్డిని మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. దేవర యాంజల్ గ్రామ పరిధిలోనే 160పైగా అక్రమ నిర్మాణాలు కమిటీ దృష్టికి వచ్చాయని పత్రికల్లో కథనాలు వచ్చాయి. ఒక్కే గ్రామంలో ఇన్ని అక్రమాలు ఉంటే , గ్రేటర్ చుట్టూ వేలాది అక్రమ నిర్మాణాలు బయట పడే అవకాశం ఉందన్నారు. కేవలం రాజకీయ కోణంలోనే దేవరయాంజల్ భూ ఆక్రమణలపై ప్రభుత్వం కమిటీ వేసిందన్నారు. అలా కాకుండా సీతారామ స్వామి ఆలయానికి సంబంధించిన 1531 ఎకరాల భూమి 1925 నుంచి ఎవరి చేతుల్లోకి మారిందనే విషయాన్ని బయట పెట్టాలన్నారు. కేవలం ఈటెల రాజేందర్ కుటుంబానికి సంబంధించిన అక్రమ నిర్మాణాలపై కమిటీ దృష్టి పెట్టిందన్నారు. అదే దేవాలయానికి సంబంధించిన భూముల్లో కేసీఆర్ దగ్గరి బంధువులకు సంబంధించిన నిర్మాణాలు కూడా ఉన్నాయి. కేసీఆర్ వాటాదారుడిగా ఉన్న నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే పత్రికలు సర్వే నెం. 437లో ఉన్నాయి. అక్కడి నుంచే ప్రచురణ అవుతున్నాయి.ఆర్మీ నిబంధనలు ఉల్లంఘించి 45 ఫీట్ల ఎత్తు వరకు నమస్తే తెలంగాణ భవన కార్యాలయం నిర్మించారు. ఇదే గ్రామపరిధిలోని సర్వే నెం. 212 నుంచి 218 సర్వే నెంబర్లలోని 84 ఎకరాల భూమిని కేసీఆర్ దగ్గరి బంధువు గండ్ర శ్రీనివాస్ అక్రమించారు.
గండ్ర శ్రీనివాస్ నిజామాబాద్ జిల్లా నంది పేట మండలం. శ్రీని డెవలపర్స్ పేరిట 84 ఎకరాల్లో వెంచర్ వేసి విక్రయించారు. ఈ భూములు 22A కింద నిషేధిత జాబితాలో ఉన్న రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. నిషేధిత జాబితాలో ఉన్నభూములను రిజిస్ట్రేషన్ చేసిన శామీర్ పేట సబ్ రిజిస్టార్‌పై కేసు నమోదు చేయాలన్నారు. 657 సర్వే నెం.లోని భూమిని అక్రమించి మంత్రి మల్లా రెడ్డి బావమరిది శ్రీనివాస్ రెడ్డి ఫామ్ హౌస్ నిర్మించారు. శ్రీనివాస్ రెడ్డి భార్య లక్ష్మీ గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీకి ఛైర్మన్‌గా ఉన్నారని తెలిపారు.