ఎవరు ఎవరిని పొగడాలి. ఎప్పుడు పొగడాలి. అనేది పూర్తిగా వాళ్ళ వాళ్ళిష్టమే. సహజంగా వ్యక్తులు అయినా..వ్యవస్థలు అయినా అరుదైన రికార్డులు సాధిస్తే వారికి సహజంగానే అన్ని వర్గాల నుంచి ప్రశంసలు..అభినందనలు దక్కుతాయి. ఇందులో ఎలాంటి అభ్యంతరాలు ఉండాల్సిన అవసరం లేదు. కానీ ఈ మధ్య తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద మీడియా సామ్రాజ్యం కలిగిన ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు తీరు తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. తాజాగా రామోజీరావు చర్య పలువురిని మరింత ఆశ్చర్యానికి..షాక్ కు గురిచేసింది. తాజాగా స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల తరపున నిజామాబాద్ నుంచి కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. దీనికి ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు కవితకు అభినందనల లేఖ పంపారు. ఇది మీడియా గ్రూపుల్లో సర్కులేట్ కావవటంంతో వైరల్ గా మారింది. అంతే కాదు..ఇది చూసిన చాలా మంది జర్నలిస్టులు కూడా షాక్ కు గురవుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయపరంపర కొనసాగించి ప్రాబల్యం చాటుకున్న మీరు శాసనమండలిలో ప్రజా వాణిని మరింత గట్టిగా వినిపించి జననాయకురాలిగా ఇనుమడించినా కీర్తి గడిస్తారని విశ్వశిస్తున్నాను అంటూ ఆయన తన లేఖలో పేర్కొన్నారు.
ప్రజాసేవలో మరెన్నో విజయాలు సాధించి అందరి మన్ననలందుకుంటారని భావిస్తూ..రామోజీరావు అంటూ అభినందన లేఖను ముగించారు. ఎమ్మెల్సీగా గెలుపు అనేది చాలా సాధారణ అంశం. ఏకంగా రాష్ట్రంలో ఉన్న 119 అసెంబ్లీలో వంద కుపైగా సీట్లు, భారీ ఎత్తున స్థానిక సంస్థల్లో టీఆర్ఎస్ ప్రాతినిధ్యం కలిగిన సమయంలో ముఖ్యమంత్రి కుమార్తె ఎమ్మెల్సీగా ఎన్నిక కావటం అరుదైన విషయం ఏమీ కాదు. మరి దీనికి కూడా రామోజీరావు అభినందనల లేఖ రాయటం వెనక కారణాలు ఏమిటి?. ఈ మధ్య ఆయన అధికార పార్టీలో ఎవరు మొక్కలు నాటినా..మొక్కలకు నీళ్లు పోసినా ఇలాంటి లేఖలు రాస్తున్నారు. మరి రామోజీరావు ఈ మధ్య ఎమ్మెల్సీలుగా గెలిచిన వారందరికీ ఇలాగే అభినందనలు లేఖలు రాశారా?. లేక కవిత ముఖ్యమంత్రి కెసీఆర్ కుమార్తె కాబట్టి ఆమెకు మాత్రమే ఈ ప్రత్యేకతా అన్న విషయం మాత్రం తెలియదు. ఏది ఏమైనా రామోజీరావు తీరు ఈ మధ్య రాజకీయ వర్గాల్లో, మీడియా సర్కిళ్ళలో తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది.