కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై బిజెపి మంగళవారం నాడు నేపాల్ నైట్ క్లబ్ వీడియోతో ఎటాక్ చేసిన విషయం తెలిసిందే. రాహుల్ తో క్లబ్ లో ఉన్నది చైనా దౌత్యవేత్త అని రకరకాల ప్రచారాలు చేశారు. బిజెపి నేతలతోఓపాటు ఈ ప్రచారాన్ని వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి కూడా కొనసాగించారు. అయితే ఇప్పుడు ఓ జాతీయ మీడియా అసలు విషయాన్ని వెలుగులోకి తెచ్చింది. రాహుల్ తో ఉన్నది అసలు చైనా దేశీయురాలే కాదని..ఆమె రాహుల్ ఎవరి పెళ్లికి అయితే హాజరయ్యారో సుమ్నిమా ఉదాస్ అనే జర్నలిస్ట్ స్నేహితురాలు అని తేల్చారు. రాహుల్ తో ఉన్నది నేపాలీ మహిళ, వధువు స్నేహితురాలు రాబిన్ శ్రేష్ట అని పేర్కొంది. నైట్ క్లబ్ యాజమాన్యంతో కూడా మాట్లాడి ఆ విషయాన్ని నిర్ధారించుకున్నారు.
రాహుల్ ఓ ఐదారుగురి స్నేహితులతో కలసి వచ్చారని..అందులో అసలు చైనా దేశీయులు ఎవరూలేరని తెలిపారు. గంటన్నర పాటు రాహుల్ క్లబ్ లో గడిపారని తెలిపారు. బిజెపి సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో భారీ ఎత్తున వైరల్ అవటంతోపాటు రాజకీయంగా కూడా పెద్ద దుమారం రేపిన విషయం తెలిసిందే. వాస్తవానికి బిజెపి ప్రచారం చేసిన వీడియోలో పెద్దగా అభ్యంతరకర అంశాలు కూడా ఏమీ లేవు. అయినా దాన్ని వైరల్ చేసి రాహుల్ ను డ్యామేజ్ చేయాలనే ప్రయత్నం చేశారు. మరి ఇప్పుడు అసలు విషయం వెలుగులోకి రావటంతో బిజెపి ఎలా స్పందిస్తుందో వేచిచూడాల్సిందే.