తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఓ యువకుడు ఆత్మహత్య చేసుకుని చనిపోయిన ఘటనను మంత్రి చాలా చిన్న అంశం అంటూ వ్యాఖ్యానించటంపై విస్మయం వ్యక్తం అవుతోంది. అంతే కాకుండా ఆయన తన మంత్రి పదవి అంశాన్ని సామాజిక కోణానికి జత చేసి వ్యాఖ్యానించటం కూడా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గత కొన్ని రోజులుగా రాజకీయంగా దుమారం రేపుతున్న సాయి గణేష్ ఆత్మహత్య ఘటనపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తాజాగా స్పందించారు. ఆయన వైరాలో కమ్మ కళ్యాణం మండపం ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాట్లాడారు.
ఖమ్మంలో చిన్న విషయం జరిగితే దానిని అడ్డం పెట్టుకొని తనపై కుట్ర చేస్తున్నారని అన్నారు. కొంత మంది సూడో చౌదరీలు వారితో చేతులు కలిపి తనపై కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గంలో కమ్మ సామాజిక వర్గంలో తనకు మంత్రి పదవి ఇవ్వడం అదృష్టమని తెలిపారు. మంత్రి వర్గంలో నుంచి తనను తొలగించేందుకు తనపై నిందలు మోపి కుట్రలు పన్నుతున్నారని అన్నారు. అందుకే కమ్మ కులస్థులందరూ రాజకీయాలకతీతంగా ఐక్యతగా ఉద్యమం చేపట్టాలన్నారు.