సీఎం అయినా కెసీఆర్ సాఫ్ట్ కాలేదు..ఒరిజినాలిటి అలాగే ఉంది

Update: 2021-11-09 11:00 GMT

టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటీఆర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. గ‌త కొన్ని రోజులుగా సీఎం కెసీఆర్ మీడియా ముందుకు వ‌చ్చి రాష్ట్ర బిజెపి నేత‌ల‌పై, కేంద్ర ప్ర‌భుత్వంపై ఘాటైన వ్యాఖ్య‌ల‌తో విమ‌ర్శ‌లు చేస్తున్నారు. దాన్యం కొనుగోలు, పెట్రోలియం ఉత్పత్తుల ద‌ర‌ల త‌గ్గింపున‌కు సంబంధించి బిజెపి, టీఆర్ఎస్ ల మ‌ధ్య మాట‌ల యుద్ధం న‌డుస్తోంది. కెసీఆర్ ఉద్య‌మ స‌మ‌యంలో వాడిన‌త‌ర‌హాలోనే ప్ర‌తిప‌క్ష పార్టీల‌పై తీవ్ర విమ‌ర్శ‌ల‌తో ఎదురుదాడి చేస్తున్నారు. ఇదే అంశంపై మంత్రి కెటీఆర్ స్పందిస్తూ సినిమా స్టైల్ లో స్పందించారు. ముఖ్యమంత్రి అయ్యాక కేసీఆర్‌ సాఫ్ట్‌ అయ్యారనుకుంటున్నారా..?. లోపల ఒరిజినల్‌ అలాగే ఉంది అంటూ వ్యాఖ్యానించారు. కెటీఆర్ మంగ‌ళ‌వారం నాడు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పర్యటించారు. తెలంగాణ ఉద్యమ స్పూర్తితో మళ్లీ ఉద్యమించి కేంద్ర ప్రభుత్వాన్ని తరిమి కొడదామన్నారు. ఏడేళ్ల తర్వాత మళ్ళీ కేసీఆర్ అసలు రూపం చూపిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఆయన్ని ఇలాగే చూడాలని రాష్ట్రంలోని అందరూ కోరుతున్నారని ఆయన అన్నారు. పక్క రాష్ట్రంలోని బీజేపీ నేతలకు మన అభివృద్ధి కనిపిస్తోందని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. కానీ మన పక్కనున్న వారికి తెలియడం లేదని మంత్రి కేటీఆర్‌ వ్యంగ్యంగా రాష్ట్ర బీజేపీ నేతలపై విరుచుకుపడ్డారు. కళ్ళుండి చూడలేని కబోదులు ఇక్కడి బీజేపీ నేతలని కేటీఆర్‌ ఎద్దేవా చేసారు. కాంగ్రెస్‌కు 60 ఏళ్లు అధికారం ఇస్తే గుడ్డి గుర్రం పళ్లు తోమారా అని కేటీఆర్‌ ప్రశ్నించారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదని అనడానికి వారికి సిగ్గుండాలని మంత్రి కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేసారు.

                                ఏడేళ్లలో ఎవరూ ఊహించని విధంగా కామారెడ్డి జిల్లాని అభివృద్ది చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌ది అని మంత్రి కేటీఆర్‌ అన్నారు. 3,400 గ్రామపంచాయతీలని కొత్తగా ఏర్పాటు చేసింది కేసీఆర్‌. ప్రతి పేదవాడి మొహంలో సంతోషం చూడాడనికి సకాలంలో సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రంలో బీజేపీ పాలిత ప్రాంతాల్లో కూడా తెలంగాణలో నడుస్తున్న సంక్షేమ పథకాలు అమలుచేయండని అడుగుతున్నారు.వెకిలి మాటాలు మాట్లాడేవాళ్లు ఎక్కువైండ్రు. కేసీఆర్‌ మీద మాట్లాడితే ఊరుకోం. ఏప్రిల్‌ 27కి ఇరవై ఏళ్లు నిండినయి. ఒక ప్రాంతీయ పార్టీ రెండుసార్లు అధికారంలోకి రావడం ఎంత కష్టం. ఉద్యమానికి గులాబీ జెండా మోసినప్పుడు అప్పటి ప్రభుత్వం 370 మంది పిల్లల్ని కాల్చి చంపింది.కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకులాగా కేసీఆర్‌ ఉన్నాడు. ఒక్కొక్క అడుగువేస్తూ ఆనాడే ఉద్యమానికి స్ఫూర్తి నిచ్చింది నిజామాబాద్‌ జిల్లా. తెలంగాణ కోసం కొట్లాడే నాయకుడు కేసీఆర్‌. 50,60 ఏండ్లు రాజకీయం చేసిన షబ్బీర్‌ అలీకి సిగ్గు, మానం ఏమీ లేదు. కేసీఆర్‌ ఆశీస్సులతో కామారెడ్డికి గోదావరి నీళ్లు వస్తాయి. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో కరెంటు లేదు, సాగు,తాగు నీరు లేదు. 200 రూపాయల పెన్షన్‌కి కాంగ్రెస్‌ వాళ్లు డబ్బాలు కొట్టుకున్నారు. 42 లక్షల మందికి రూ.10వేల కోట్లను నెలకి పెన్షన్ల రూపంలో ఇస్తోంది టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం. భారతదేశంలో మొదటిసారి ఒంటరి మహిళకు పెన్షన్‌ ఇస్తోంది కేసీఆర్‌, ప్రైవేట్‌ ఆస్పత్రులకి ధీటుగా ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స చేస్తున్నార‌ని తెలిపారు.

Tags:    

Similar News