తెలంగాణ రైస్ మిల్లుల్లో భారీ అవ‌క‌త‌వ‌క‌లు

Update: 2022-04-20 11:55 GMT

న‌ల‌భై రైస్ మిల్లుల్లోనే 4.5 లక్షల ధాన్యం సంచులు మాయం

కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌

తెలంగాణ స‌ర్కారు వ‌ర్సెస్ కేంద్రం పోరు కొత్త మ‌లుపు తిరిగింది. కేంంద్రంలోని బిజెపి స‌ర్కారు రైతుల ధాన్యం కొనుగోలు చేయ‌టంలేద‌ని చెప్పాల‌ని టీఆర్ఎస్ ప్ర‌య‌త్నం చేస్తుంటే..తెలంగాణ రైస్ మిల్లుల్లో భారీ ఎత్తున అక్ర‌మాలు జ‌రిగాయ‌ని ఈ లెక్క‌లేంటో తేల్చాల‌ని బిజెపి, కేంద్రం కోరుతోంది. దీనికి సంబంధించి కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి బుధ‌వారం నాడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. కిష‌న్ రెడ్డి ప్ర‌క‌ట‌నతో ఈ మొత్తం క‌థ మ‌రో ట‌ర్న్ తీసుకున్న‌ట్లు అయింది. బుధ‌వారం నాడు మీడియాతో మాట్లాడిన కిష‌న్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. అందులోని ముఖ్యాంశాలు..' రాష్ట్రంలో కొన్ని రైస్ మిల్లులో ఉండాల్సిన ధాన్యం లేదు. కొన్ని రైస్ మిల్లులలో అవకతవకలు జరిగాయి. ఎఫ్‌సీఐ అధికారులు 40 రైస్ మిల్లులో తనిఖీలు చేశారు. 4,53,890 లక్షల సంచుల ధాన్యం తక్కువగా ఉంది.. అవి ఎక్కడికి పోయాయే ప్ర‌భుత్వం చెప్పాలి. రాష్ట్ర ప్రభుత్వం, ప్ర‌జాప్ర‌తినిధులు దీనిపై స్పందించాలి. రైస్ మిల్లుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం అగ్రిమెంట్ చేసుకున్నది కాబట్టి మిస్ అయిన ధాన్యంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని అలెర్ట్ చేశాము. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని రైస్ మిల్లులపై తనిఖీలు చేయాలని ప్ర‌భుత్వానికిఇ లేఖ రాశాం. అక్రమాలకు పాల్పడిన రైసు మిల్లులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు. ఈ నెల 13న రాష్ట్ర సివిల్ సప్లయ్ కార్యదర్శి కేంద్రానికి లేఖ రాశారు. తెలంగాణలో ఉన్న బియ్యాన్ని కొనాలని లేఖలో పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనాలకు కేంద్రం వెంటనే ఆమోదం తెలిపింది. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇంతవరకు రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేయలేదు. కెసీఆర్‌ ప్రభుత్వం కావాలనే ఘర్షణ వాతావరణం సృష్టించింది. అన్ని రాష్ట్రాలకూ ఒకే న్యాయం ఉంటుంది. అగ్రిమెంట్ ప్రకారమే ధాన్యం కోనుగోలు చేశాము. బాయిల్ రైస్ కోనుగోలు చేయబోమని అన్ని రాష్ట్రాలకు లేఖలు రాశాము. టీఆర్‌ఎస్‌ నేతలు ఉద్దేశ పూర్వకంగా ప్రధాని మోదీని తిట్టడం, దేశం నుంచి తరిమి కొడతామని పిచ్చి పిచ్చిగా మాట్లాడారు. ఢిల్లీలో, రాష్ట్రంలో, గ్రామాల్లో ఆందోళనలు నిర్వహించారు. బీజేపీని బంగాళాఖాతంలో కలుపుతామని కామెంట్స్‌ చేశారు. ఇది కరెక్ట్‌ కాదు'. అని వ్యాఖ్యానించారు. క్వింటాల్‌ ధాన్యానికి కేంద్రం రూ.1,960 ధర నిర్ణయించింది. రాజకీయ ప్రయోజనాల కోసం రైతుల జీవితాలలో రాష్ట్ర ప్రభుత్వం అడుకుంటున్నది. 2020-21 యాసంగి, రబీ ధాన్యాన్ని ఒప్పందం ప్రకారం ఇస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకూ ఇవ్వలేదు.

దానిపై ఐదు సార్లు కేంద్రం లేఖ రాసినా తెలంగాణ సర్కార్ నుంచి స్పందన లేదు. ఈ ఏడాది 40 లక్షల మెట్రిక్ టన్నుల రా రైస్ ఇస్తామని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. అందుకోసం 15 కోట్ల గోనె సంచులు అవసరం.. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర కేవలం కోటి గోనె సంచులు మాత్రమే ఉన్నాయి. వాటితో ధాన్యాన్ని ఎలా కొనుగోలు చేస్తారు..? తండ్రి కొడుకులు తట్టలో తీసుకువస్తారా..?. హుజురాబాద్ ఎన్నికల ఓటమి భరించలేక.. బాధ్యత మరచి కక్షతో కేంద్ర ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారు. తెలంగాణను రావణ కాష్టంగా మార్చారు. రాజకీయాలు చేయాలనుకుంటే వేరే అంశాలు ఉన్నాయి. తండ్రి, కొడుకులు రైతులపై రాజకీయాలు ఆపాలని అన్నారు. బియ్యం స్కామ్ పై సీబీఐ విచార‌ణ చేయించాల‌ని కొంత మంది త‌మ‌కుల లేఖ రాశార‌ని..అయితే అది త‌మ చేతుల్లో లేద‌న్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వం కోరితే తాము సీబీఐ విచార‌ణ‌కు రెడీగా ఉన్నామ‌న్నారు.

Tags:    

Similar News