రాష్ట్రానికి నెంబ‌ర్ వ‌న్ ద్రోహి కెసీఆరే

Update: 2021-11-08 10:11 GMT

గంట పాటు కెసీఆర్ అబ‌ద్ధాలే చెప్పారు

బండి సంజ‌య్ ధ్వ‌జం

కెసీఆర్ వ‌ర్సెస్ బండి సంజ‌య్. హుజూరాబాద్ ఫ‌లితం త‌ర్వాత తెలంగాణ రాజ‌కీయం వేడెక్క‌కుతోంది. ఆదివారం నాడు మీడియా స‌మావేశం పెట్టిన సీఎం కెసీఆర్ తెలంగాణ బిజెపి ప్రెసిడెంట్ బండి సంజ‌య్ పై, కేంద్రంపై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. కెసీఆర్ విమ‌ర్శ‌ల‌కు బండి సంజ‌య్ సోమ‌వారం నాడు కౌంట‌ర్ ఇచ్చారు. ఆయ‌న బిజెపి రాష్ట్ర కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడారు. కెసీఆర్‌ నోరు తెరిస్తే అన్నీ అబద్దాలేనని మండిపడ్డారు. రైతులను ఆగం చేసింది కేసీఆర్ కాదా? అని ఆయన ప్రశ్నించారు. కేంద్రం పెత్తనం ఏంటని అనేది కేసీఆరే.. మళ్లీ కేంద్రం ధాన్యం కొనడం లేదని అనేది కేసీఆరే అని పేర్కొన్నారు. కేసీఆర్ పూటకో మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. కొంతమందితో కుమ్మక్కై కేసీఆర్ అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. 'వరి కొంటామని కేంద్రం స్పష్టమైన ప్రకటన చేసింది. ధాన్యాన్ని కేంద్రం కొంటుందా.. రాష్టం కొంటుందా. ఇన్నాళ్లు కేంద్రమే వడ్లు కొన్నది. 40 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం కొంటామని కేంద్రం లేఖ ఇచ్చింది. కేంద్రం పంపిన లేఖ కేసీఆర్‌కు వచ్చిందా.. రాలేదా?, రైతుల చట్టాల విషయంలో కేసీఆర్‌ పూటకో మాట మాట్లాడతారు. మార్కెట్‌ కమిటీలను రద్దు చేస్తామని కేంద్రం ఎప్పుడు చెప్పింది. దమ్ముంటే కేసీఆర్‌ ఆధారాలు చూపించాలి. 62 లక్షల ఎకరాల్లో వరి ఎక్కడ సాగవుతుందో కేసీఆర్‌ చెప్పాలి. ఒకసారి వరి వద్దంటారు.. మరొకసారి పత్తి వద్దంటారు. రుణమాఫీ చేస్తామని కేసీఆర్‌ మూడేళ్ల క్రితం చెప్పారు. రైతులు ఎక్కడ సంతోషంగా ఉన్నారో కేసీఆరే చెప్పాలి.

ఉద్యోగాలు ఇవ్వనందునే నిరుద్యోగులు కూలీలుగా మారుతున్నారు. రైతు ఆత్మహత్యలు కేసీఆర్‌కు కనిపించడం లేదా..ప్రతీ గింజా మేమే కొంటామని కేసీఆర్‌ హామీ ఇచ్చారు. కేంద్రం పెత్తనం ఏందని అప్పట్లో కేసీఆర్‌ విమర్శించారు. కేంద్రమంత్రిపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడి నోరు పారేసుకున్నారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరల తగ్గింపు ప్రకటన చేస్తారనే ఆశించాం. కానీ అది జరగలేదు. పెట్రోల్‌, డీజిల్‌ రేట్లు ఎందుకు తగ్గించరో చెప్పాలి. లీటర్‌ పెట్రోల్‌పై రాష్ట్రానికి రూ. 28 వస్తోంది. పెట్రోల్‌, డీజిల్‌పై వ్యాట్‌ పెంచలేదని కేసీఆర్‌ చెబుతున్నారు. 2015లో తెలంగాణ రాష్ట్ర వ్యాట్‌ పెంచింది.. జీవోలు ఉన్నాయి' అని బండి సంజయ్ మండిప‌డ్డారు. తెలంగాణ సీఎం కెసీఆర్ అబ‌ద్ధాల కోసం ఓ శాఖ పెట్టార‌ని విమర్శించారు. దీని బాధ్య‌త‌లు హ‌రీష్ రావుకు అప్ప‌గించార‌న్నారు. హుజూరాబాద్ లో టీఆర్ఎస్ కు క‌ర్రు కాల్చి వాత పెట్టార‌న్నారు. రాష్ట్రానికి నెంబ‌ర్ వ‌న్ ద్రోహి కెసీఆర్ అని విమ‌ర్శించారు. ఏడేళ్ల నుంచి కేంద్రమే ధాన్యం కొంటుంద‌ని కెసీఆర్ చెప్ప‌ద‌ల‌చుకున్నారా? అని ప్ర‌శ్నించారు. ఇన్నాళ్లు అబద్ధాలు చెప్పాన‌ని ఒప్పుకుని ముక్కు నేల‌కు రాయాల‌న్నారు.

Tags:    

Similar News