తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్లమెంటరీ పార్టీ నేత కె. కేశవరావు పెద్ద సాహసమే చేశారు. అదేంటి అంటారా?. టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కెసీఆర్ కు సవాళ్ల మీద సవాళ్లు విసురుతున్న హుజూరాబాద్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ను అప్యాయంగా కౌగిలించుకున్నారు. కెసీఆర్ కు బద్ధశత్రువుగా మారిన ఈటెలను కెకె ఇంత అంత అప్యాయంగా కౌగిలించుకుంటే మరి కెసీఆర్ కు కోపం రాదా?. సహజంగా టీఆర్ఎస్ అధినేతలు కెసీఆర్..కెటీఆర్ లు ఎవరినైనా వ్యతిరేకిస్తే పార్టీ అంతా వారిని వ్యతిరేకించాలి. వారిద్దరూ అభిమానిస్తే అంతే స్థాయిలో అభిమానించాలి. ఇంచుమించు అన్ని ప్రాంతీయ పార్టీల్లో ఇదే ట్రెండ్ ఉంటుంది. కాకపోతే టీఆర్ఎస్ లో ఇది కాస్త ఎక్కువ . ఆదివారం నాడు హైదరాబాద్ లో జరిగిన కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కుమారుడి వివాహంలో ఇలాంటి ఆసక్తికర సన్నివేశాలు ఎన్నో జరిగాయి.
ఈ పెళ్లికి తెలంగాణ ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటీఆర్ కు కూడా హాజరయ్యారు. ఆ సమయంలో మాజీ మంత్రి, హూజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కూడా వచ్చారు. ఈటెల రాజేందర్ తో చాలా మంది అభిమానులు సెల్ఫీలు దిగుతుంటే ఆ సమయంలోనే పక్క నుంచి మంత్రి కెటీఆర్ వెళ్లారు. అడ్డం వచ్చిన వారిని కెటీఆర్ భద్రతా సిబ్బంది పక్కకు నెట్టేశారు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్ వాట్సప్ మీడియా గ్రూపుల్లో తెగ సర్కులేట్ అయింది. అయితే కెకె మాత్రం ఒకప్పటి సహచర నేత, ఎమ్మెల్యే ఈటెలను ఆప్యాయంగా కౌగిలించుకున్నారు. మరి దీని పర్యవసానాలు ఎలా ఉంటాయో వేచిచూడాల్సిందే. ఈ వీడియో కూడా సోషల్ మీడియాలోనూ..మీడియా గ్రూపుల్లోనూ వైరల్ గా మారింది.