బద్వేలు అసెంబ్లీకి జరగనున్న ఉప ఎన్నికలో జనసేన నుంచి అభ్యర్థిని పోటీకి నిలవడం లేదని పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అనంతపురం జిల్లా కొత్త చెరువులో నిర్వహించిన బహిరంగ సభలో ఈ విషయాన్ని తెలియజేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యే మృతి చెందినందున ఉప ఎన్నిక వచ్చిందని, మృతి చెందిన ఎమ్మెల్యే భార్యకే వైసిపి టికెట్ ఇచ్చినందున ఈ నిర్ణయం తీసుకున్నాం అని తెలిపారు. బద్వేలు ఉప ఎన్నిక విషయంలో పార్టీ నాయకులతో చర్చించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కొద్ది రోజుల క్రితం ఈ సీటు అంశంపై పవన్ కళ్యాణ్, బిజెపి ఏపీ ప్రెసిడెంట్ సోము వీర్రాజుతో సమావేశం అయ్యారు. ఎవరు పోటీచేయాలనే అంశంపై ఈ భేటీ జరిగినట్లు వార్తలు వచ్చాయి.
తాజాగా వైసీపీ ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ రాజకీయంగా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ పదిహేను సీట్లకే పరిమతం అవుతుందని అన్నారు. దీనికి కౌంటర్ ఇచ్చిన ఏపీ మంత్రులు టీడీపీ, జనసేన, బిజెపి కలసి పోటీచేసిన వైసీపీని ఓడించలేరన్నారు. అప్పటిదాకా ఎందుకు బద్వేల్ ఉప ఎన్నికలో పోటీచేసి తన బలం ఏమిటో చూపించాలని సవాల్ విసిరారు. ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ పోటీకి దూరం అని ప్రకటించటం విశేషం.