పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. పశ్చిమ బెంగాల్ ప్రయోజనాల కోసం అవసరం అయితే ప్రధాని మోడీ కాళ్ళు పట్టుకుంటానని వ్యాఖ్యానించారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కూడా బిజెపి, కేంద్రం తనపై కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రధాని, ముఖ్యమంత్రి మధ్య మాత్రమే జరగాల్సిన సమావేశంలో ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు ఎలా ఉంటారని ప్రశ్నించారు. చిల్లర రాజకీయాలు చేస్తూ బెంగాల్ ప్రజలను అవమానపరచొద్దంటూ బీజేపీకి, ప్రధాని మోదీలకు తేల్చి చెప్పారు. బెంగాల్ ప్రజల కోసం ఎంతో కష్టపడుతున్న చీఫ్ సెక్రటరీ బదిలీని రద్దు చేయాలని కేంద్రాన్ని మమత బెనర్జీ డిమాండ్ చేశారు. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ప్రధాని మోడీని కోరారు. లేదంటే ఇది బ్యూరోక్రాట్ వ్యవస్థపై దాడి అవుతుందన్నారు. యాస్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని ముందుగానే షెడ్యూల్ ఖరారు చేసుకున్నట్టు మమత తెలిపారు.
ఇంతలో ప్రధాని పర్యటన ఉందని తెలియడంతో... ఆయన హెలికాప్టర్ దిగే స్థలానికి చేరుకుని ఎదురు చూశామన్నారు. ఆ తర్వాత ఆయన్ని కలిసేందుకు వెళితే మీటింగ్‌లో ఉన్నారని, ఎవరికీ అనుమతి లేదని చెప్పడంతో అక్కడ మరో 20 నిమిషాల పాటు ఎదురు చూశామన్నారు. ఆ తర్వాత కాన్ఫరెన్స్ హాల్‌లో ప్రధాని, ముఖ్యమంత్రుల సమావేశం ఉందని చెప్పడంతో అక్కడికి వెళ్లామన్నారు. అయితే అక్కడ ప్రతిపక్షపార్టీలకు చెందిన నాయకులు కూడా ఉన్నారని మమత తెలిపారు. దీంతో వెంటనే ప్రధానికి తమ రిపోర్టును సమర్పించి... ఆయన అనుమతి తోనే అక్కడి నుంచి బయటకు వచ్చామన్నారు. ఆ వెంటనే తుపాను ప్రభావిత ప్రాంతాల పర్యటనకు తాను వెళ్లినట్టు మమత వివరించారు.
ఇటీవల వచ్చిన తుపానుల నష్టాన్ని అంచనా వేసేందుకు గుజరాత్, ఒడిషాలలో ప్రధాని మోదీ పర్యటించారు. ఆ రాష్ట్ర సీఎంలతో సమావేశమయ్యారు, కానీ ఎక్కడా ప్రతిపక్ష నేతలను ఆ సమావేశాలకు ఆహ్వనించలేదని మమత చెప్పారు. కేవలం బెంగాల్‌లోనే ఎందుకు ప్రతిపక్ష పార్టీలను మీటింగ్‌కు పిలిచారని ఆమె ప్రశ్నించారు. ఇటీవల బెంగాల్‌లో ఎదురైన ఘోర ఓటమిని బీజేపీ జీర్ణించుకోలేక పోతుందని, అందుకే ఆ ఓటమికి ప్రతీకారంగా బెంగాల్ ప్రజలను అవమానించాలని చూస్తున్నారంటూ మమత ఆరోపించారు. ప్రధాని ఎప్పుడు బెంగాల్‌కి వచ్చినా ఇక్కడి ప్రభుత్వాన్ని అస్థిర పరచాలని చూస్తున్నారంటూ ఆమె విమర్శించారు. మీడియాలో తమ వెర్షన్ మాత్రమే పంపిస్తూ తనను టార్గెట్ చేశారన్నారు.