పారిశ్రామిక‌వేత్త‌ల‌కు రాయితీలిస్తారు..రైతుల‌కివ్వ‌రా?

Update: 2021-11-11 13:20 GMT

కేంద్రంపై హ‌రీష్ రావు ఫైర్

పారిశ్రామిక వేత్తలకు ఎన్నో సబ్సిడీలు, రాయితీలు ఇచ్చే కేంద్రం రైతులకు ఎందుకు ఇవ్వదు అని తెలంగాణ ఆర్ధిక‌, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హ‌రీష్ రావు ప్ర‌శ్నించారు. రైతుల నష్టాలు ఎందుకు భరించర‌న్నారు. కేంద్రం ధాన్యం పై యూ టర్న్ తీసుకోవడం వల్లే సమస్య వ‌చ్చింద‌న్నారు. హ‌రీష్ రావు గురువారం నాడు మీడియాతో మాట్లాడుతూ కేంద్రం, బిజెపి తీరుపై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని విమ‌ర్శించారు. అబద్దాలు మాట్లాడటం లో మిగతా బీజేపీ నేతలతో కిషన్ రెడ్డి పోటీ పడుతున్నార‌ని ఎద్దేవా చేశారు. వరి ,సిలిండర్, కేసీఆర్ కిట్ ఇలా అన్ని అంశాల్లో బీజేపీ వి అబద్ధాలే అని విమ‌ర్శించారు. కిషన్ రెడ్డి మెడికల్ కళాశాలల విషయం లో తప్పుడు ప్రచారం చేస్తున్నార‌ని ఆరోపించారు. ఎయిమ్స్ కు బీబీ నగర్ లో మేము స్థలమే ఇవ్వలేదని బాధ్యతా రాహిత్యంగా మాట్లాడుతున్నార‌ని, తాము నిమ్స్ కోసం స్థలం భవనాన్ని ఏర్పాటు చేసుకుని ఎయిమ్స్ కు ఇచ్చామని తెలిపారు.

మెడికల్ కళాశాల విషయం లో తెలంగాణ కేంద్రం తో ఉత్తర ప్రత్యుత్తరాలు జరపలేదు అని కిషన్ రెడ్డి మరో పచ్చి అబద్ధం చెప్పారన్నారు. ల‌క్ష్మారెడ్డి మంత్రిగా ఉన్నపుడు ఎన్నో సార్లు ఢిల్లీ వెళ్లి మెడికల్ కళాశాలల గురించి మాట్లాడారని తెలిపారు. యూపీ కి 27 మెడికల్ కాలేజి లు ఇచ్చి తెలంగాణ కు ఇవ్వకపోవడం మా పట్ల సవతి తల్లి ప్రేమ, అవమానం ప్రదర్శించడం కాదా అని ప్ర‌శ్నించారు. ఎయిమ్స్ మీరు ఇవ్వడం ఏమిటీ. అది విభజన చట్టం కింద ఇచ్చిన హామీ అన్నారు. ఈ రోజు బీజేపీ వాళ్ళు ఎందుకు ధర్నా చేసినట్టు... వారి ధర్నాలో రైతులు లేరని, రైతులకు బీజేపీ నిజ స్వరూపం అర్థమైందని తెలిపారు. రేపటి ధర్నాలు ప్రారంభం మాత్రమే. వివిధ రూపాల్లో ఆందోళన కొనసాగుతుంద‌ని తెలిపారు. ప్రజలు బీజేపీ అబద్ధాలను నమ్మే స్థితి లో లేర‌న్నారు.

Tags:    

Similar News