ప్లేయ‌ర్లు ఆడ‌క‌పోతే కెప్టెన్ కు పేరు వ‌స్తుందా?

Update: 2021-06-16 14:36 GMT

మాజీ మంత్రి ఈటెల రాజేంద‌ర్ మ‌రోసారి ముఖ్య‌మంత్రి కెసీఆర్ పై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. కెసీఆర్ ఆదేశాలను తాము సమర్థవంతంగా అమలు చేయకుంటే.. పేరు, గుర్తింపు కెప్టెన్‌ వచ్చేవి కావని అన్నారు. ఉద్యమంలో తాము లేకుంటే కెప్టెన్ ఎక్కడుండేవాడని ఈటల రాజేందర్‌ ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వ పాలనపై ప్రజలు అసహ్యం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. కొత్త రాష్ట్రంలో ఇన్ని బాధలు ఉంటాయని తెలంగాణ సమాజం ఊహించి ఉండదని అన్నారు. . గడ్డిపోస కూడా ఇప్పుడు అవసరపడుతుందని, ప్రజల ఆశీర్వాదం ఉంటేనే రాజకీయ నాయకునికి బతుకుంటుందని ఆయన పేర్కొన్నారు. ఈటెల రాజేంద‌ర్ మంగ‌ళ‌వారం నాడే ఢిల్లీ నుంచి తిరిగొచ్చిన విష‌యం తెలిసిందే. ఆయ‌న‌తో బుధ‌వారం నాడు మేడ్చ‌ల్ జిల్లాకు చెందిన బిజెపి నేత‌లు స‌మావేశం అయ్యారు. తెలంగాణలో ఆత్మగౌరవం కోసం మరో ఉద్యమం మొదలైందని అన్నారు. మేడ్చల్ జిల్లాలోని షామీర్‌పేట్‌లోని తన నివాసంలో జిల్లా బీజేపీ అధ్యక్షుడు పన్నాల హరిచంద్ర రెడ్డితో కలిసి ఈటల రాజేందర్‌ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హుజురాబాద్ ఉప ఎన్నికను ప్రజలు తమ సొంత ఎన్నికగా భావిస్తున్నారన్నారు. ప్రతి వ్యక్తి తామే ఎన్నికల్లో పోటీచేస్తున్నట్లు ఎన్నిక ఉండబోతోందన్నారు.

ఉద్యమంలో హుజూరాబాద్ నియోజకవర్గం స్పూర్తి నింపిందని తెలిపారు. బీజేపీలో చేరటం గర్వంగా ఫీలవుతున్నానని, 2024లో తెలంగాణలో ఎగిరే జండా కాషాయం జెండా అని ఈటల రాజేందర్‌ అన్నారు. మరో ఆత్మగౌరవ పోరాటానికి సిద్ధం కావాలి. చరిత్ర మెదలు కావటానికి ఏదొక పార్టీ తోడు ఉండాలి కాబట్టే టీఆర్ఎస్‌లో పనిచేశాను. నా ఇల్లు మేడ్చల్‌లోనే ఉంది. వాళ్ల కళ్ళలో మెదిలిన బిడ్డను నేను. మీకు నిత్యం అందుబాటులో ఉంటాను. నేను నిప్పులాగా పెరిగిన బిడ్డను. భూమి గుంజుకున్నా లోంగిపోలేదు. కానీ ఇప్పుడు చట్టం కొంతమందికే పని చేస్తుంది. ఈ ప్రభుత్వం కొనసాగితే తెలంగాణ ప్రజలకు అరిష్టం. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని దించే వరకు నిద్రపోవద్దు అని సమాజం అంతా అనుకుంటుంది. గుణపాఠం చెప్పాలి. అహంకారానికి ఘోరీ కట్టాలి' అని ఈటల రాజేందర్‌ వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News