వ్యవసాయ బిల్లుల అంశంపై దేశ వ్యాప్తంగా దుమారం రేగుతోంది. ఓ వైపు రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తుండగా..కేంద్రం మాత్రం బిల్లుల విషయంలో వెనక్కి తగ్గేది లేదని చెబుతోంది. ఈ తరుణంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అసెంబ్లీ వేదికగా వ్యవసాయ బిల్లులను చించేశారు. కరోనా కాలంలో అంత వేగంగా చట్టాలను ఆమోదించుకోవడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. వ్యవసాయ బిల్లులపై కేంద్రం మరోమారు పునరాలోంచుకోవాలని, బ్రిటీషర్స్ కంటే అధ్వానంగా తయారుకావొద్దంటూ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. 'వ్యవసాయ బిల్లుల ప్రయోజనాలను రైతులకు వివరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని కేంద్రం చెబుతోంది.
రైతుల భూములు తీసుకోనందున అది వారికి లాభం చేకూరుతుందని యూపీ సీఎం యోగి అంటున్నారు. అసలు ఇవి రైతులకు ప్రయోజనకరమా?ఢిల్లీ సరిహద్దుల్లో గత మూడు వారాలుగా రైతులు తమ నిరసన తెలియజేస్తున్నారు. లాఠీ చార్జీలు చేసినా , టియర్ గ్యాస్ ప్రయోగించినా లెక్కచేయకుండా ఒక్క అడుగు కూడా వెనక్కి తగ్గకుండా ప్రతీ రైతు ఓ భగత్‌సింగ్‌లా మారారు. ఈ క్రమంలో రైతు నిరసనలకు మద్దతుగా ఆప్ వారికి బాసటగా నిలుస్తోంది. వారికి తాగునీరు, వైద్యం, పారిశుధ్యం, వంటి మౌలిక సదుపాయాలను అందిస్తోందని, రైతుల డిమాండ్లకు తాము సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం' అని కేజ్రీవాల్ పేర్కొన్నారు.