తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ మరోసారి జాతీయ రాజకీయాలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. చివరి రక్తపు బొట్టువరకూ దారపోసి అయినా దేశాన్ని గాడిన పెట్టేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని ప్రకటించారు. దేశంలో ప్రస్తుతం జుగుప్సాకర పరిస్థితులు ఉన్నాయని..దారి తప్పిపోతోందని ఆరోపించారు. దేశంలోనే అతి తక్కువ నిరుద్యోగులు ఉన్న రాష్ట్రంగా తెలంగాణ ఉందన్నారు. కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టడం సరికాదన్నారు. దేశాన్ని ప్రభావితం చేసేలా ముందుకెళుతున్నామని తెలిపారు. కేంద్రంలో ధర్మంతో పనిచేసే ప్రభుత్వం ఉండాల్సిన అవసరం ఉందన్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మల్లన్న సాగర్ ప్రాజెక్టును ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం నాడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ఈ మల్లన్న సాగర్ ప్రాజెక్టు కల సాకారం కావడానికి ఎంతో మంది కృషి చేశారని అన్నారు.
తెలంగాణ సస్యశ్యామలం కావాలని కోరుకున్నామని తెలిపారు. నూతన తెలంగాణ నిర్మించుకున్న అతిభారీ ప్రాజెక్టు మల్లన్న సాగర్ అని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అతిపెద్ద రిజర్వాయర్ మల్లన్న సాగర్ అని చెప్పారు. కాళేశ్వరంలో 58 వేలమంది కార్మికులు పని చేస్తున్నారని తెలిపారు. ప్రాజెక్టు పనులు ఆపాలని కొందరు కోర్టుకు వెళ్లారని అన్నారు. ప్రాజెక్టును ఆపే కుట్రతో వందలాది కేసులు వేశారని తెలిపారు. ఎందరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా వెరవకుండా ముందుకెళ్లామని అన్నారు. మల్లన్న సాగర్.. తెలంగాణ జన హృదయ సాగరం అని అభివర్ణించారు. ఖమ్మంలో సీతారామ ప్రాజెక్ట్ త్వరలోనే పూర్తి చేస్తామని సీఎం స్పష్టం చేశారు. అన్ని రంగాల్లో తెలంగాణ దూసుకెళ్తోందని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. 24 గంటల విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, రాష్ట్రం అభివృద్ధిని చూసి మహారాష్ట్ర సీఎం ఆశ్చర్యపోయారన్నారు.