మేం ఎవ‌రి వెంటా ప‌డం..ఎవ‌రికీ భ‌య‌ప‌డం

Update: 2022-03-18 14:58 GMT

గ‌త కొంత కాలంగా చిన‌జీయ‌ర్ స్వామి వివాదాల‌కు కేంద్ర బిందువుగా మారారు. కొద్ది రోజుల క్రితం ఆయ‌న మాంసాహారం తినేవారిపై చేసిన వ్యాఖ్య‌లు పెద్ద దుమార‌మే రేపాయి. వ‌న దేవ‌త‌లు స‌మ్మ‌క్క‌-సార‌ల‌మ్మ‌ల‌ను కించ‌ప‌ర్చేలా మాట్లాడిన‌ట్లు ఉన్న‌ట్లు ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల వీడియో ఒక‌టి తాజాగా సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. దీంతో దీనిపై ప‌లు క‌థ‌నాలు వ‌చ్చాయి. చిన‌జీయ‌ర్ త‌న వ్యాఖ్య‌లకు సంబంధించి వెంట‌నే క్షమాప‌ణ‌లు చెప్పాల‌ని ప‌లువురు డిమాండ్ చేశారు. అంతే కాదు..పోలీసు స్టేష‌న్ల‌లో కూడా ఫిర్యాదులు చేశారు. ఈ వివాదంపై ఆయ‌న శుక్ర‌వారం నాడు విజ‌య‌వాడ‌లో మీడియాతో మాట్లాడారు. ఎప్పుడో ఇర‌వై సంవ‌త్స‌రాల క్రితం మాట్లాడిన మాట‌ల‌ను వ‌క్రీక‌రించి ప్ర‌చారం చేస్తున్నార‌ని మండిప‌డ్డారు.

                              అదే స‌మ‌యంలో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తాను ఎవ‌రికీ భ‌య‌ప‌డ‌న‌ని..ఎవ‌రి వెంటా ప‌డ‌న‌ని వ్యాఖ్యానించారు. సీఎం కెసీఆర్ తో విభేదాలు ఉన్నాయా అన్న మీడియా ప్ర‌శ్న‌కు స్పందించారు . త‌న‌కు ఎవ‌రితోనూ వివాదాలు లేవు..ఉండ‌వ‌న్నారు. తాము స‌మాజానికి క‌ళ్లులాంటి వార‌మ‌ని..త‌మ బాధ్య‌త త‌మ‌కుంద‌న్నారు. మంచి లక్ష్యంతో మంచి కార్యక్రమాలు చేస్తున్నామని అందుకే ధైర్యంగా మాట్లాడగలుగుతున్నామన్నారు. రాజకీయాల్లోకి వస్తారా అని ఓ విలేకరి ప్రశ్నించడంతో తమకు అలాంటి ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. కొంత మంది పనిగట్టుకుని వివాదం చేసి టీవీల్లో వాళ్ల వాళ్ల ముఖాలను ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. రష్యా-ఉక్రెయిన్ హడావుడి తగ్గడంతో ఈ ప్రచారం చేస్తున్నారని తప్పుబట్టారు.

                                     20 ఏళ్ల కింద అన్నమాట గురించి వివాదం జరిగినట్టు తన దృష్టికి వచ్చిందని, గ్రామదేవతల్ని కించపరిచినట్టుగా ఆరోపణలు వచ్చాయని తెలిపారు. తాము ఎప్పుడూ అలాంటి దురుద్దేశపూర్వక వ్యాఖ్యలు చేయలేదని పేర్కొన్నారు. తాత్పర్యం తెలుసుకోకుండా ఆరోపణలు చేస్తే.. వారిపై జాలిపడాల్సి వస్తుందన్నారు. కొందరు సొంత లాభం కోసమే వివాదం చేస్తున్నారని తప్పుబట్టారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ముస్లిం, క్రిస్టియన్స్‌ కూడా వస్తుంటారని తెలిపారు. తమకు కులం, మతం అనే తేడా లేదని చెప్పారు. అందరిని గౌరవించాలనేది తమ విధానమని ప్రకటించారు. మహిళలను చిన్నచూపు చూసేవారిని ప్రోత్సహించమని స్పష్టం చేశారు. కొందరు పనిగట్టుకుని సమస్యగా మారుస్తున్నారని, సమాజ హితం లేనివారే ఇలాంటి అల్పప్రచారం చేస్తున్నారని జీయర్‌స్వామి ఆక్షేపించారు.

Tags:    

Similar News