త్వరలో చంద్రబాబు పార్టీని కూడా రద్దు చేస్తారు

Update: 2021-04-02 13:28 GMT

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు దూరంగా ఉండాలన్న తెలుగుదేశం నిర్ణయంపై అధికార వైసీపీ మండిపడింది. దివంగత ఎన్టీఆర్ వెలిగించిన తెలుగుదేశం జ్యోతిని ఆర్పేందుకు చంద్రబాబు, లోకేష్ కంకణం కట్టుకున్నారని వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. ఆయన శుక్రవారం నాడు తాడేపల్లిలో మీడియాతోమాట్లాడారు. ఓటమి భయంతోనే చంద్రబాబు ఎన్నికలను బహిష్కరించారన్నారు. ఓటమికి భయపడేవాడు రాజకీయ నాయకుడు కాదు అని వ్యాఖ్యానించారు. ఆగిపోయిన ఎన్నికల ప్రక్రియను.. ప్రారంభిస్తే తప్పేంటి? అని అంబటి రాంబాబు ప్రశ్నించారు. నిమ్మగడ్డ ఏకపక్షంగా ఎన్నికలు వాయిదా వేసినప్పుడు ఎందుకు అడగలేదు అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఏనాడూ ఒంటరిగా అధికారంలోకి రాలేదు అని గుర్తుచేశారు. రేపు అసెంబ్లీ, పార్లమెంట్‌కు కూడా అభ్యర్థులు దొరకరు అన్నారు. చంద్రబాబు త్వరలో పార్టీని కూడా రద్దు చేస్తారు అని చెప్పారు. నువ్వు రాజకీయ నాయకుడివి కాదు.. పిరికివాడివి అని చంద్రబాబు నిర్ణయాన్ని తప్పుపట్టారు.

తిరుపతిలో కూడా పోటీ విరమించుకుంటారా అని ప్రశ్నించారు. వెన్నుపోటు ద్వారా రాజ్యాధికారం సాధించారు అని విమర్శించారు. ఎన్నికలకు వెళ్లినా.. గెలిచేటట్టు లేదని.. చంద్రబాబుకు తెలిసే ఈ బహిష్కరణ నిర్ణయం తీసుకున్నారని అంబటి రాంబాబు చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ పుట్టగతులు లేకుండా పోయిందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు తెలిపారు. పార్టీల గుర్తు లేకుండా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున సీట్లు సంపాదించినట్లు ప్రచారం చేసుకున్నారని, కానీ మున్సిపల్ ఎన్నికలు వచ్చేసరికి అసలు బండారం బయటపడిందని అన్నారు. ఒక్క చోట తప్ప..రాష్ట్రమంతటా వైసీపీనే గెలిచిందని గుర్తు చేశారు. నారా లోకేష్ ఇటీవల మాట్లాడితే సీఎం జగన్ కు హెచ్చరిక చేస్తున్నానంటూ ప్రకటనలు చేస్తున్నాడని..ఆయన అసలు అంత సీనుందా అని ప్రశ్నించారు. నోరు ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే సరికాదన్నారు.

Tags:    

Similar News