బిఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా నుంచి తిరిగి వచ్చిన ఆమె శుక్రవారం రాత్రి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లోనే మీడియా తో మాట్లాడారు. కెసిఆర్ కు లేఖ రాసిన మాట నిజమే అని ఆమె స్పష్టం చేశారు. పార్టీ నాయకుల్లో ఉన్న అభిప్రాయాలనే తాను చెప్పానన్నారు. అయితే గతంలో కూడా తాను లేఖలు రాశాను అని..ఇప్పుడు ఈ లేఖ ఎలా బయటకు వచ్చింది...దీన్ని లీక్ చేసింది ఎవరో తెలియాలి అన్నారు. కెసిఆర్ దేవుడు అంటూ...అయన పక్కన దెయ్యాలు ఉన్నాయి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇప్పుడు ఆ దెయ్యాలు ఎవరు అన్న చర్చ తెర మీదకు వచ్చింది. కవితే ఒక పక్క కెసిఆర్ తో యాక్సెస్ కేవలం కొంత మందికే అని చెపుతూ తన లేఖలో ప్రస్తావించారు. ఇప్పుడు ఆమె ఆయన పక్కన కొన్ని దెయ్యాలు ఉన్నాయని చెప్పటం అన్నది అత్యంత కీలకంగా మారింది. తన లేఖ చూసి కాంగ్రెస్, బీజేపీ లు ఏదో సంతోషపడుతున్నాయని..తమ నాయకుడు కెసిఆర్ అనే పేర్కొన్నారు.
పార్టీ లో..కుటుంబంలో ఎలాంటి విబేధాలు లేవు అని చెప్పుకొచ్చారు. తాను రాసిన లేఖ బయటకు వస్తే.. పార్టీలో ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటో అర్ధం చేసుకోవచ్చు అన్నారు. లేఖ రాయటంలో తనకు ఎలాంటి వ్యక్తిగత ఎజెండా లేదు అన్నారు. అయితే కవిత కు స్వాగతం పలకటానికి చాలా మంది ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు. అయితే ఇందులో ఒక్కరు కూడా బిఆర్ఎస్ జెండా పట్టుకోలేదు పైగా...ఆ పార్టీ రంగు కనిపించకుండా పూర్తిగా కవిత సొంత ఎజెండా తో కూడిన స్లొగన్స్ ఉన్న ప్లకార్డులు పట్టుకున్నారు. సామజిక తెలంగాణ లక్ష్యంగా పని చేస్తున్న కవిత కు స్వాగతం అని అందులో పేర్కొన్నారు. కవిత అడుగులు చూసుంటే ఆమె సొంత పార్టీ దిశగా వెళుతున్నారు అనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. రాబోయే రోజుల్లో ఈ పరిణామాలు ఇంకెన్ని మలుపులు తీసుకుంటాయో చూడాలి.