జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం కోసం పెద్ద ఎత్తున తరలివస్తున్న బిజెపి నేతలు, కేంద్ర మంత్రులపై తెలంగాణ మంత్రి కెటీఆర్ వ్యంగాస్త్రాలు సంధించారు. వీరంతా పొలిటికల్ టూరిస్టులు మాత్రమే అని..వీరి వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదన్నారు. సింహం సింగిల్ గానే వస్తుందని వ్యాఖ్యానించారు. అంతే కాదు..గుంపులుగా.ఎవరు వస్తారు అని సభికులను ప్రశ్నించి..ఈ మాట తాను అనలేదని..కేసులు పెడితే మీ మీదే పెడతారని కెటీఆర్ వ్యాఖ్యానించారు. ఎన్నికలు అనగానే పరిగెత్తుకుని వస్తున్న ఢిల్లీ బీజేపీ నాయకులు ఈ ఆరేళ్లలో తెలంగాణ రాష్ట్రానికి, హైదరాబాద్ నగరానికి ఏంచేశారో చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. వరదల్లో హైదరాబాద్ నగర ప్రజలు తల్లడిల్లుతుంటే కనీసం ఇటు వైపు చూసే సాహసం కూడా బీజేపీ నాయకులు చేయలేదన్నారు.
గుజరాత్ లో వరదలు వస్తే 500 కోట్లు, బెంగుళూరులో వరదలు వస్తే 669 కోట్లు హుటాహుటిన వరదసాయం ప్రకటించిన మోడీ తెలంగాణ ముఖ్యమంత్రి హైదరాబాద్ నగరంలో వరదలు వస్తే 1350 కోట్ల సాయం అందించమని ఉత్తరం స్తే ఉలుకూ పలుకూ లేకుండా దున్నపోతు మీద వానపడ్డట్లు చేస్తున్నారన్నారు. హైదరాబాద్ నగరానికి ఎన్నికల ప్రచారం కోసం వస్తున్న కేంద్ర మంత్రులు తెలంగాణ ప్రజల పక్షాన కేసీఆర్ డిమాండ్ చేసిన 1350 కోట్లు తీసుకొని రావాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. జన ధన్ ఖాతాలు ప్రజలు ఓపెన్ చేస్తే ప్రతీ ఒక్కరి అకౌంట్లో ధన్ ధన్ మంటూ 15 లక్షలు వేస్తామని ప్రజలను మోసం చేశారన్నారు. గల్లీ పార్టీ కావాలో ఢిల్లీ పార్టీ కావాలో ప్రజలు నిర్ణయించుకోవాలని కేటీఆర్ అన్నారు.