బంగారు భారత్ నిర్మిద్దాం..విదేశాల వాళ్ళే వీసాలు తీసుకుని ఇక్కడకు రావాలి
తెలంగాణలో జరిగే పనులు దేశమంతా జరగాలని కోరుకుంటున్నారు
తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన సోమవారం నాడు నారాయణ్ ఖేడ్ బహిరంగ సభలో మాట్లాడుతూ జాతీయ రాజకీయ అంశాలను మరోసారి ప్రస్తావించారు. ఈ బహిరంగ సభలో కెసీఆర్ వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే....'తెలంగాణలో జరిగే పనులు దేశ వ్యాప్తంగా జరగాలని దేశం కోరతా ఉంది. దేశం కూడా బాగుండాల్సిన అక్కర ఉంది. దేశం గురించి మనం కూడా కొట్లాడాల్సిన అక్కర ఉంది. ఇంకా ఇంత డెవలప్ చేసుకుంటే..బంగారు తున్కలాంటి తెలంగాణ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ మధ్య మీరు పేపర్లలో..టీవీలో చూస్తున్నారు నేను జాతీయ రాజకీయాల్లో పోయి మాట్లాడుతున్నా.పోదామా జాతీయ రాజకీయాల్లోకి. కొట్లాడదామా. ఢిల్లీదాకా కొట్టాడతామా. భారతదేశాన్ని బాగుచేద్దామా? ఎలా అయితే తెలంగాణ బాగుచేసుకున్నామో. అదే పద్దతిలో మనం భారత దేశ రాజకీయాల్లో కూడా ప్రముఖ పాత్ర పోషించాలి. తప్పకుండా ఈ దేశాన్ని అమెరికా కంటే గొప్ప దేశంగా తయారుచేసే విధంగా ముందుకుపోవాలి. మనం అమెరికాకు పోవుడు కాదు..ఇతర దేశాలే వీసాలు తీసుకుని భారతదేశానికి వచ్చే పరిస్థితి కల్పించాలి. ఈ దేశానికి గొప్ప సంపద, వనరులు, యువశక్తి ఈ దేశంలో ఉన్నాయి. నిన్న మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే ను కలిశాను. . మీ రాష్ట్రంలో రైతు బంధు, రైతు బీమా అమలు చేస్తున్నారుగా.
సరిహద్దుల వాళ్లు ఇక్కడ కూడా అమలు చేయాలని చావగొడుతున్నారు. ' అని ఠాక్రే అన్నారని తెలిపారు. కొంత మంది మతపిచ్చితో గొడవలు చేయాలని చూస్తున్నారని..రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ బాగుంటేనే నిమ్జ్ వంటి ప్రాజెక్టులతో పెట్టుబడిదారులు వస్తారు..ఉద్యోగాలువస్తాయన్నారు. కానీ గొడవలు..కత్తిపోట్లు ఉంటే ఎవరైనా ఇక్కడకు వస్తారా అని ప్రశ్నించారు. ఈ అంశాలపై మీరు గ్రామ గ్రామంలో చర్చ పెట్టాలని సభకు హాజరైన వారికి సూచించారు. అన్ని వర్గాలు..అన్ని కులాలు..అన్ని మతాలు బాగుండాలన్నారు. . రైతు చనిపోతే వారం లోపు ఖతాలో 5 లక్షల రూపాయలు పడుతున్నాయని..ఇందుకు ఎవరినీ కలవాల్సిన అవసరం..లంచం ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. దేశంలో దుర్మార్గమైన పాలన సాగుతోందని..దీనికి చరమగీతం పాడాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ వస్తే మనకు పాలించటం చేతకాదన్న వాళ్లే ఇప్పుడు నానా కష్టాలు పడుతున్నారని ఏపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు . దేశంలో 24 గంటలు విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు..