హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అయోధ్యలో కొత్తగా నిర్మించనున్న మసీదు అంశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అవినీతి సొమ్ముతో దీన్ని నిర్మిస్తున్నారని..ఇక్కడ ప్రార్ధనలు చేసే అవకాశం కూడా ఉండదన్నారు. బాబ్రీ మసీదు కూల్చిన చోట మసీదు నిర్మాణం అనైతికమన్నారు. అయోధ్యలో మసీదు నిర్మాణానికి చందాలు ఇవ్వడం తప్పని వ్యాఖ్యానించారు.
అలాంటి మసీదులో ప్రార్థనలు చేయడం పాపమని మతపెద్దలు చెబుతున్నారని పేర్కొన్నారు. తాము ఏకమైతే 70 ఏళ్ల నుంచి రాజకీయలబ్ధి పొందుతున్న వాళ్లను కూల్చగలమన్నారు. ముస్లింలు ఎవరూ ఎన్నికల్లో దళితులతో పోటీ పడొద్దని సూచించారు. తాను అంబేద్కర్ అభిమానిని..దళితులకు సహకరిస్తానని స్పష్టం చేశారు. దేశంలో శాంతి కోరుకునే వారిని జైలుకు పంపిస్తున్నారని వ్యాఖ్యానించారు.