ఆ చాన్స్ కూడా అయిపోవడంతో డెట్ సీలింగ్ పెంపు తప్పనిసరైంది. ఇలాంటి సందర్భంలో మరిన్ని రుణాల ద్వారా నిధులను పొందేందుకు అమెరికా కాంగ్రెస్ సాధారణంగా తరచూ ఆమోదముద్ర వేస్తుంది. ఈసారి అలా జరిగేలా లేదు. ప్రతినిధుల సభలో రిపబ్లికన్ల ఆధిపత్యం ఉండడం.. డెట్ సీలింగ్ పెంపు బిల్లుపై అధికార డెమోక్రాట్ల ప్రతిపాదనను వారు అంగీకరించకపోతుండడమే దీనికి కారణం. వాస్తవానికి బిల్లు పాస్‌కాక.. డెట్ సీలింగ్ పెంపు నిలిచిపోవడం అనేది గతంలో జరగలేదు. అప్పు పరిమితి పెంచక పోతే ఫెడరల్ ఉద్యోగులు, సైనిక సిబ్బంది, పింఛన్ల చెల్లింపులు నిలిచిపోవడం, జాతీయ పార్కులు తదితర ఏజెన్సీలు మూతపడే ప్రమాదం ఉండొచ్చు. డెట్ సీలింగ్ పెంపు గడువు జూన్1. ఆ లోగా సంబంధిత బిల్లుకు ఆమోదం లభించకుంటే ప్రభుత్వ రుణాలు, వాటిపై వడ్డీ చెల్లింపు ఆలస్యమవుతుంది. క్రెడిట్ రేటింగ్ తగ్గిపోతుంది. కొత్తగా తీసుకునే రుణాలకు అధిక వడ్డీ రేటు చెల్లించాల్సి ఉంటుంది. ఇది ఇలాగే కొనసాగితే స్టాక్ మార్కెట్ల పతనం మొదలై ఆర్థిక వ్యవస్థ ప్రమాదంలో పడే అవకాశం ఉంది అని చెపుతున్నారు. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న వేళ ప్రభుత్వం కూడా ఆచితూచి వ్యవహరిస్తోంది.