'వైల్డ్ డాగ్' మూవీ రివ్యూ

Update: 2021-04-02 08:42 GMT

అక్కినేని నాగార్జున. ఈ మధ్య కాలంలో సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న సీనియర్ హీరోల్లో ఒకరు. బిగ్ బాస్ లో చిన్న తెర మీద సందడి చేసినా..వెండి తెర మీద సందడి బాగా తగ్గిందనే చెప్పాలి. ఒకప్పుడు నాగార్జున సినిమా అంటే ఆ క్రేజే వేరు. అయితే ఆయన కూడా పెరిగిన వయస్సు కారణంగా కథల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటున్నా కూడా అవి కూడా క్లిక్ కావటం లేదు. తనకు ఎంతో నచ్చిన కథ వైల్డ్ డాగ్ అని.. ..దర్శకుడు అహిషోర్ సాల్మన్ చాలా బాగా చెప్పాడన్నారు. సీన్ కట్ చేస్తే వైల్డ్ డాగ్ సినిమాలో పాత సీనే రిపీట్ అయింది. ఇక సినిమా అసలు కథ విషయానికి వస్తే విజ‌య్ వ‌ర్మ (అక్కినేని నాగార్జున‌) ఎన్ఐఏ ఆఫీస‌ర్‌. నేరస్థులను అరెస్ట్ చేయటం కంటే...దొరికిన వాళ్ళను దొరికినట్లు లేపేయటమే అలవాటు. ఈ కారణంగానే ఉద్యోగం కూడా పొగొట్టుకుంటాడు. గోకుల్ చాట్‌లో జ‌రిగిన బాంబ్ బ్లాస్ట్ కార‌ణంగా విజ‌య్ వ‌ర్మ త‌న‌ కుమార్తె న‌వ్య‌ను కోల్పోతాడు. దాంతో ఎన్ఐఏకు దూరంగా ఉంటాడు. అయితే మ‌ళ్లీ దేశంలో వ‌రుస బాంబ్ బ్లాస్ట్‌ లు జ‌రుగుతాయి.

వీటికి సంబధించి ఎలాంటి క్లూ కూడా దొర‌క‌దు. దాంతో ఉన్న‌తాధికారులు కేసును విజ‌య్ వ‌ర్మ నేతృత్వంలోని ఎన్ఐఏ(నేష‌న‌ల్ ఇన్వెస్టిగేష‌న్ ఏజెన్సీ) టీమ్‌కి అప్ప‌గిస్తారు. ఇండియ‌న్ మొజాహిద్దీన్‌కి చెందిన ఖ‌లీద్ ప్లానింగ్‌తోనే ఇండియాలో బ్లాస్టులు జ‌రుగుతున్నాయ‌ని విజ‌య్ వ‌ర్మ అండ్ టీమ్ క‌నిపెడుతుంది. ఖ‌లీద్‌ను ట్రాప్ చేసి ప‌ట్టుకోవ‌డానికి ఓ ప్లాన్ చేస్తారు. కానీ ఖ‌లీద్ దొర‌క్కుండా త‌ప్పించుకుంటాడు. దీంతో విజ‌య్ వ‌ర్మ‌ను సస్పెండ్ చేస్తారు. స‌స్పెండ్ అయినా కూడా విజ‌య్ వ‌ర్మ త‌న టీమ్ స‌హాయంతో ఖ‌లీద్ అచూకీ క‌నుగొంటాడు. ఇంత‌కీ ఖ‌లీద్ నేపాల్‌లో ఎందుకు దాక్కొంటాడు? అత‌న్ని ప‌ట్టుకోవ‌డానికి విజ‌య్ వ‌ర్మ అండ్ టీమ్ ఎలాంటి ప్లాన్ చేస్తుంది? చివ‌ర‌కు విజ‌య్ ప్లాన్ వ‌ర్క‌వుట్ అవుతుందా? ఖ‌లీద్ దొరుకుతాడా? అనేదే 'వైల్డ్ డాగ్' మూవీ.

విజయ్ వర్మ భార్య పాత్ర‌లో దియా మీర్జా క‌నిపించింది. ఇక అలీరెజా ఇత‌ర స‌భ్యుల‌తో నాగ్ పాత్ర కేసులో ప్ర‌ధాన సూత్ర‌ధారి ఎవ‌ర‌నే విష‌యాన్ని క‌నిపెడుతుంది. అయితే ఎన్ఐఏ అధికారిగా నాగార్జున తన పాత్రకు అవసరమైన జాగ్రత్తలు తీసుకున్నారు. ఫస్టాఫ్ కంటే సినిమా సెకండాఫ్ మాత్రమే పర్వాలేదు అన్పిస్తుంది. కథ, కథనంలో ఏ మాత్రం కొత్తదనం లేకపోవటం సినిమాకు మైనస్ గా మారింది. ఒక్క మాటలో చెప్పాలంటే నాగార్జునకు మరోసారి నిరాశే ఎదురైందని చెప్పొచ్చు.

రేటింగ్. 2.25/5

Tags:    

Similar News