వీరసింహారెడ్డి మూవీ రివ్యూ

Update: 2023-01-12 07:19 GMT

నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ సినిమా సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. అలాంటి హిట్ తర్వాత ..అది కూడా బాలకృష్ణ మరో సారి సంక్రాంతి బరిలో నిలిచారంటే ఫాన్స్ అంచనాలు ఎలా ఉంటాయో ఊహించుకోవచ్చు. మలినేని గోపీచంద్ దర్శకత్వం లో తెరకెక్కించిన ఈ సినిమాలో నందమూరి బాల కృష్ణ మరో సారి తన నట విశ్వరూపం చూపించారు అని చెప్పొచ్చు. ముఖ్యంగా వీరసింహరెడ్డి క్యారెక్టర్ లుక్ సినిమాకే హై లైట్ గా నిలించింది. రాయలసీమ ప్రాంత ఆధారిత కథలతో తెలుగులో లెక్కలేనన్ని సినిమాలు ఇప్పటికే వచ్చాయి. దర్శకుడు గోపీచంద్ మరి ఈ తరహా కథను ఎంపిక చేసుకుని ఒకింత సాహసం చేశారనే చెప్పొచ్చు. ఎందుకంటే ప్రేక్షకులు కొత్తదనం కోరుకుంటున్న వేళ రొటీన్ ఫార్ములా కథలతో విజయం సాధించటం అంటే అంత ఆషామాషీ వ్యవహారం ఏమి కాదు. ఇక సినిమా కథ విషయాన్ని వస్తే పెద్దయ్య గా అందరూ పిలుచుకునే (వీరసింహారెడ్డి) తమ ఊరి బాగు కోసం పనిచేస్తూ ఉంటాడు. ప్రత్యర్థి నిత్యం పగతో రగులుతూ ఎలాగైనా వీరసింహారెడ్డిని అంతమొందించేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. సినిమా అంతా దీని చుట్టూనే తిరుగుతుంది. ఇవి ఇప్పటికే చాలా సినిమాల్లో చేసినవే. అయితే ఈ సినిమాల్లో బాల కృష్ణ ను వీరసింహారెడ్డి పాత్రలో దర్శకుడు గోపీచంద్ పర్ఫెక్ట్ గా చూపించారు. ఫైట్స్ కూడా స్టైలిష్ గా తెరకెక్కించారు. లుక్ దగ్గరవుంచి పొలిటికల్ టచ్ ఉన్న డైలాగులతో ఆకట్టుకున్నాడు.

                                         బుర్ర సాయి మాధవ్ అందించిన సంబాషణ లు సినిమా మొత్తానికి హైలైట్ గా నిలిచాయి. వీరసింహరెడ్డి సినిమా అంతా సంబాషణలు, థమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, ఎలివేషన్లు బాలకృష్ణను ఒక రేంజ్ కు తీసుకెళ్లాయి. ఫస్ట్ హాఫ్ అంతా సినిమా ఒక్కమాటలో చెప్పాల్నంటె దుమ్మురేపింది. సెకండ్ హాఫ్ కు వచ్చేసరికి వీరసింహరెడ్డి బ్యాగ్రౌండ్ చెప్పటం, సెంటిమెంట్స్ తో నడిపించారు. అయితే ఫస్ట్ హాఫ్ సాగినంత వేగంగా సెకండ్ నడవలేదనే చెప్పాలి. అయితే ఈ సినిమాలో విలన్ గా నటించిన దునియా విజయ్, నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారక్టర్ లో వరలక్ష్మి శరత్ కుమార్ లు తమ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.బాల కృష్ణ, శృతి హాసన్ ల లవ్ ట్రాక్ పెద్దగా ఆకట్టుకునేలా లేదు. వీరసింహారెడ్డి, హనీ రోజ్ లవ్ ట్రాక్ కూడా ఆలా సో సో గానే ఉంది. అయితే హనీ రోజ్ తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. సినిమాలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుని పొలిటికల్ డైలాగులు పెట్టారు. ఇవి ప్రజలకు కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. అయితే ముఖ్యంగా తెలుగు దేశం శ్రేణులు వీటిని ఎన్నికల ప్రచారానికి వాడుకున్నా ఆశర్యపోవాల్సిన పనిలేదు. మొత్తం మీద ఈ సంక్రాంతి బరిలో నిలిచిన బాలకృష్ణ కొత్త ఏడాది హిట్ తో బోణి కొట్టినట్లే లెక్క. వీరసింహరెడ్డి లో హింస శృతి మించినట్లు ఉంది. ముఖ్యంగా విలన్ల తలలు ఎగిరిపడి సన్నివేశాలు చూస్తే బోయపాటి సినిమా వినయ విధేయ రామ గుర్తుకు రావటం ఖాయం. బాలకృష్ణ ఫాన్స్ కు అయితే సినిమా పండగే.

                                                                                                                                                                                             రేటింగ్: 3 .25 /5

Tags:    

Similar News