ఛలో సినిమా తర్వాత నాగశౌర్యకు సరైన హిట్ లేదనే చెప్పాలి. రీతూ వర్మకు కూడా పెళ్లిచూపుల తర్వాత పూర్తి స్థాయి సత్తా చాటే సినిమా దక్కలేదు. మధ్యలో మద్యలో తెలుగు సినిమాల్లో చేసినా కూడా అవి కూడా ఓ మోస్తరు పాత్రలే. కానీ ఇప్పుడు నాగశౌర్య, రీతూవర్మలకు తగ్గ పాత్రలు దొరికాయి ఈ 'వరుడు కావలెను' సినిమాలో. ఈ సినిమాకు కథ అందించటమే కాకుండా..దర్శకత్వం వహించిన లక్ష్మీ సౌజన్య తన తొలి ప్రయత్నంలోనే మంచి విజయం సాధించారు. ఇక సినిమా అసలు కథ విషయానికి దుబాయ్ లో ఆర్కిటెక్ట్ గా పనిచేసే ఆకాష్ (నాగశౌర్య) అక్కడ రొటీన్ లైఫ్ తో బోర్ కొట్టి ఇండియాకు వస్తాడు. ఇక్కడ ప్రాజెక్టులు టేకప్ చేయాలనుకుంటాడు. భూమి (రీతూవర్మ) ఓ స్టార్టప్ ద్వారా వ్యాపారం చేస్తుంటుంది. ఆమె కంపెనీ కొత్తగా నిర్మించనున్న ప్రాజెక్టు డిజైన్ బాధ్యతలు తీసుకుంటాడు ఆకాష్. అంతకు ఎన్ని డిజైన్లు చూసినా ఒప్పుకోని భూమి ..ఆకాష్ డిజైన్లను ఓకే చేస్తుందా?. డిజైన్ల సక్సెస్ తోపాటు వీళ్ళ ప్రేమ ఎలా విజయం సాధించింది అన్నదే సినిమా. భూమి తల్లితండ్రులుగా నదియా, మురళీ శర్మలు కీలక పాత్రలు పోషించారు. ఎలాగైనా భూమికి పెళ్లి చేయాలని నిత్యం అదే పనిపై కేఫ్ ల్లో అమ్మాయి లేకుండా అబ్బాయిలను వెతికే పనిలో ఉంటుంది నదియా. ఎన్ని పెళ్లి సంబంధాలు చూసినా తనకు కనెక్ట్ అయ్యేవాడు దొరికేంత వరకూ పెళ్ళికి ఒప్పుకునేది లేదని చెబుతుంది భూమి. ఇదే విషయంపై వీరిద్దరూ నిత్యం ఘర్షణ పడుతుంటారు. స్టార్టప్ ఓనర్ గా ఫస్టాఫ్ లో తన క్యారెక్టర్ ద్వారా రీతూవర్మ సత్తా చాటారు.
ఆఫీసు సిబ్బందితో సీరియస్ గా ఉంటూ...తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. ఇదే ఆఫీసులో పనిచేసే వెన్నెల కిషోర్, సెల్ఫీ సరళ పాత్రలో హిమజలు చేసిన సందడి ఆకట్టుకునేలా ఉంది. రొటీన్ ప్రేమ కధనే దర్శకురాలు లక్ష్మీ సౌజన్య తన కథనం ద్వారా ఆసక్తికరంగా మలచటంలో విజయవంతం అయ్యారు. ఓ వైపు భూమి సీరియస్ నటన..మధ్యలో వెన్నెల కిషోర్, హిమజల కామెడీ సినిమాలో హైలెట్ గా నిలుస్తాయి. అంతే కాదు. 'బిల్డింగ్ ల సైజ్ లు పెరుగుతున్నాయి. బట్టల సైజులు తగ్గుతున్నాయ్. భూమి ఆకాశం ఎదురెదురుగా ఉన్నా ఎప్పటికీ కలవలేవు. పొగరుకు ప్రీమియర్ లీగ్ పెడితే అన్నీ అవార్డులు మా మేడంకే.' వంటి ఆకట్టుకునే డైలాగ్ లు సినిమాలో ఎన్నో. సంభాషణలు సినిమాకు మరింత బలం చేకూర్చాయి. అంతే కాదు.. ఫస్టాఫ్ లో కథతో పాటు కామెడీ కూడా మిక్స్ కావటంతో ఎక్కడా బోర్ కొట్టదు. సెకండాఫ్ లోనూ ఇదే ట్రెండ్ ను కంటిన్యూ చేశారు. సెకండాఫ్ లో సత్య, సప్తగిరిల ఎంట్రీతో సినిమా సరదాసరదాగా సాగిపోతుంది. ఈ సినిమా టీజర్, ట్రైలర్ తోనే ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి. వరుడు కావలెను సినిమా ఆ అంచనాలను నిలబెట్టుకుంది. ఓవరాల్ గా చూస్తే ఈ సినిమా ఓ మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్. నాగశౌర్యకు ఛలోలాంటి..రీతూవర్మకు పెళ్ళిచూపుల సినిమా వంటి హిట్ దక్కిందనే చెప్పొచ్చు.
రేటింగ్. 3.5\5