'తిమ్మ‌రుసు' మూవీ రివ్యూ

Update: 2021-07-30 08:47 GMT

స‌త్య‌దేవ్. విల‌క్షణ న‌టుడు. ఏ పాత్ర ఇచ్చినా అందులో పూర్తిగా ఒదిగిపోయేందుకు ప్ర‌య‌త్నం చేస్తాడు. గ‌త ఏడాది ఓటీటీలో విడుద‌ల అయిన స‌త్య‌దేవ్ సినిమా 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య‌'కు ప్రేక్షకుల ద‌గ్గ‌ర నుంచి మంచి ఆద‌ర‌ణే ల‌భించింది. అదేంటో కానీ క‌రోనా తొలి ద‌శ త‌ర్వాత విడుద‌ల అయిన తొలి సినిమా ర‌వితేజ క్రాక్ హిట్ అయింది. ఇప్పుడు రెండ‌వ ద‌శ త‌ర్వాత విడుద‌ల అయిన తొలి సినిమా 'తిమ్మ‌రుసు'. స‌త్య‌దేవ్ త‌న న‌ట‌న‌తో ఈ సినిమాను విజ‌య‌తీరాల‌కు చేర్చాడ‌నే చెప్పొచ్చు. అక్క‌డ‌క్క‌డా కొంత స్లో అన్పించినా ఇదో ఓ ప్ర‌త్యేక సినిమాగా నిలుస్తుంద‌న‌టంలో సందేహం లేదు. ఈ సినిమాలో స‌త్య‌దేవ్ లాయ‌ర్ పాత్ర‌లో క‌న్పిస్తారు. లాయ‌ర్ అంటే కేసు పేరుతో డబ్బులు పీడించే లాయర్‌గా కాకుండా, కేసును గెలిపించడం కోసం జేబులోని డబ్బును కూడా లెక్క పెట్ట‌కుండా ఖర్చుపెట్టే న్యాయవాదిగా. ఈ సినిమాలో సత్యదేవ్‌ ఇంటెలిజెంట్‌ లాయర్‌గా నటించాడు. ఎనిమిదేళ్ల క్రితం జరిగిన క్యాబ్‌ డ్రైవర్‌ మర్డర్‌ కేసును రీఓపెన్‌ చేస్తాడు. అతడి హత్య వెనకాల ఉన్న మిస్టరీని చేధించే పనిలో పడతాడు.

ఈ క్రమంలో ఆ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కుర్రాడికి ఆ హత్యకు ఎలాంటి సంబంధం లేదని తెలుసుకుంటాడు. మరి ఇందులో ఆ అబ్బాయిని ఎవరు..ఎందుకు ఇరికించారు? ఇందులో పోలీసుల ప్రమేయం ఏంటి? అసలు ఆ క్యాబ్‌ డ్రైవర్‌ను ఎందుకు హత్య చేస్తారు? ఈ చిక్కుముడులను అన్నింటినీ ఒక్కొక్కటిగా విప్పుకుంటూ వెళ్లే క‌థే ఈ సినిమా. యువ న్యాయ‌వాదిగా స‌త్య‌దేవ్ న‌ట‌న ఆక‌ట్టుకుంటుంది. ఫ‌స్టాప్ ముగింపు స‌న్నివేశాల నుంచి కేసుకు సంబంధించి సాక్ష్యాల‌ను సేక‌రించటం..వాటిని హంత‌కుడు మాయం చేయటం వంటికి క‌థ‌లో ఆస‌క్తిని రేపుతాయి. క్లైమాక్స్ సినిమాకు హైలెట్ గా నిలిచింది. బీర్బర్‌ సినిమాకు రీమేక్‌గా వచ్చిందే తిమ్మరుసు. ఈ సినిమా ఫస్టాఫ్‌ యావరేజ్‌గా ఉన్నప్పటికీ సెకండాఫ్‌ మాత్రం బాగుంది. ప్రియాంక జవాల్కర్‌ తన అందంతో, క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఉన్నంత‌లో ఆక‌ట్టుకుంటుంది. బ్రహ్మాజీ కామెడీ సినిమాకు ప్రధాన బలం. త‌క్కువ బ‌డ్జెట్ తో తెర‌కెక్కించినా సాంకేతికంగా సినిమా ఉన్న‌తంగామ‌లిచారు అని చెప్పొచ్చు. లాయ‌ర్ గా న‌టించిన స‌త్య‌దేవ్ తిమ్మ‌ర‌సు ద్వారా కేసు గెలిచారు.

3.25\5

Tags:    

Similar News