'స్టాండ‌ప్ రాహుల్' మూవీ రివ్యూ

Update: 2022-03-18 11:35 GMT

రాజ్ త‌రుణ్‌ సినిమాలు అయితే చేస్తున్నాడు కానీ ఒక్క‌టి కూడా క్లిక్క‌వటం లేదు. గ‌త కొంత కాలంగా ఈ యువ హీరోది అదే పరిస్థితి. తాజాగా రాధేశ్యామ్-ఆర్ఆర్ఆర్ మ‌ధ్య‌లో స్పేస్ చూసుకుని 'స్టాండ‌ప్ రాహుల్'-కూర్చుంది చాలు పేరుతో ప్రేక్షకుల ముందుకు వ‌చ్చాడు. రావటం అయితే వ‌చ్చాడు కానీ..సేమ్ సీన్ రిపీట్ అయింది. ప్రేక్షకులు ఆశించిన‌ట్లుగా ఈ సినిమాతోనూ నిల‌బ‌డ‌లేక‌పోయాడు రాజ్ త‌రుణ్‌. త‌ల్లి,తండ్రులు వారి పిల్ల‌ల చిన్న‌ప్పుడు నిత్యం ఘ‌ర్ష‌ణ ప‌డితే ఆ ప్ర‌భావం వారిపై ప‌డుతుంది అనేది చాలా మంది చెప్పే మాట‌. చాలా సినిమాల్లో చూసిన విష‌య‌మే. ఇక్క‌డా రాజ్ త‌రుణ్ (రాహుల్ ) విష‌యంలోనూ అదే జ‌రిగింది. రాహుల్ చిన్న‌ప్పుడే నిత్యం గొడ‌వ‌ప‌డే త‌ల్లితండ్రులుగా న‌టించిన ముర‌ళీశ‌ర్మ‌, ఇంద్ర‌జ‌లు విడిపోతారు. ఈ ప్ర‌బావంతో రాహుల్ కు పెళ్లిపై న‌మ్మ‌కం పోతుంది. మంచి ఉద్యోగం సంపాదించి జీవితంలో సెటిల్ అయి కుటుంబ ప‌రువు కాపాడాల‌ని త‌ల్లి..ఉన్న‌ది ఒక్క‌టే జీవితం..మ‌న‌సుకు న‌చ్చింది చేయాల‌ని చెప్పే తండ్రి. ఎలా ముందుకు వెళ్ళాల‌నే సంఘ‌ర్ష‌ణ‌.

అయితే త‌ల్లి చెప్పిన‌ట్లు ఉద్యోగం చేసుకుంటూనే..త‌న‌కు న‌చ్చిన స్టాండ‌ప్ కామెడీ షోలు చేస్తూ జీవితం సాగిస్తాడు రాహుల్. హైద‌రాబాద్ లోని వ‌ర్చువ‌ల్ రియాలిటీ కంపెనీలో ఉద్యోగం చేసే స‌మ‌యంలో శ్రేయారావు(వర్ష బొల్లమ్మ)తో ప్రేమ‌లో ప‌డ‌తాడు. కానీ పెళ్లిపై ఏ మాత్రం స‌ద‌భిప్రాయం లేని రాహుల్ ఆమె ప్రేమ‌ను తిర‌స్క‌రిస్తూ వ‌స్తాడు. చివ‌ర‌కు లివ్ ఇన్ రిలేష‌న్ కు అంగీక‌రించ‌టంతో ఓకే అంటాడు. కానీ స‌డ‌న్ గా శ్రేయారావుకు త‌ల్లితండ్రులు వేరే సంబంధం చూడ‌టంతో క‌థ కొత్త మ‌లుపు తిరుగుతుంది. అంతే కాదు త‌న ఓ స్టాండ‌ప్ కామెడీ షోలో త‌న బాస్ (వెన్నెల కిషోర్)పై జోకులు పేల్చ‌టంతో చివ‌ర‌కు ఉద్యోగం కూడా పోతుంది. ద‌ర్శ‌కుడు శాంటో మోహ‌న వీరంకి సినిమాను ఆస‌క్తిక‌రంగా మ‌ల‌చ‌టంలోవిఫ‌ల‌మ‌య్యాడు.

స్టాండ‌ప్ కామెడీలో అక్క‌డ‌క్క‌డ జోకులు పేలాయే త‌ప్ప‌..ఏ దశ‌లోనూ సినిమాలో జోష్ క‌న్పించ‌లేదు. ఈ మ‌ధ్య కాలంలో ప్రేక్షకులు మ‌ధ్య‌లోనే సినిమా నుంచి వెళ్ళిపోయిన ఘ‌ట‌న‌లు ఇందులోనూ క‌న్పించాయి. అయితే స్టాండ‌ప్ క‌మెడియ‌న్ పాత్ర‌ను రాజ్ త‌రుణ్ అల‌వోక‌గా చేశాడు. కానీ అందులో ద‌మ్ము లేక‌పోవ‌టంతోనే మ‌రోసారి నిరాశ‌క‌ర‌మైన ఫ‌లితాన్ని చూడాల్సి వచ్చింది. హీరోయిన్ వ‌ర్ష బొల్ల‌మ్మ మంచి న‌ట‌న క‌న‌ప‌ర్చింది. తన క్యూట్‌నెస్‌తోనే కాదు, అభినయంతోనూ ఆకట్టుకుంది. సీనియర్‌ నటులు ఇంద్రజ, మురళీశర్మల పాత్ర‌ల‌కు కావాల్సినంత బ‌లం వారి వారి పాత్ర‌ల్లో క‌న్పించ‌లేదు. ఏదో రొటీన్ గా అలా వ‌చ్చి పోతాయి అంతే. ఓ ఐటి కంపెనీ అధినేత‌గా వెన్నెల కిషోర్ ఆపిల్ కంపెనీ సీఈవో టిమ్ కుక్ లుక్ లో ఆక‌ట్టుకుంటాడు. కాక‌పోతే ఆయ‌న పాత్ర కూడా రొటీన్ గానే ఉంది. దర్శకుడు ఎంచుకున్న మిక్స్ డ్ కాన్సెప్ట్ బాగానే ఉన్నా...ప్రేక్షకుల‌కు క‌నెక్ట్ అయ్యేలా సినిమాను మ‌ల‌చలేక‌పోయాడు. ఒవ‌రాల్ గా చూస్తే స్టాండ‌ప్ రాహుల్ ప్రేక్షకుల స‌హ‌నానికి ప‌రీక్ష.

రేటింగ్. 1.75\5

Tags:    

Similar News