'సోలో బ్రతుకే సో బెటర్' మూవీ రివ్యూ

Update: 2020-12-25 09:57 GMT

సాయి తేజ్ 'సోలో బ్రతుకే సో బెటర్' సినిమాకు ఓ ప్రత్యేకత ఉంది. కరోనా లాక్ డౌన్ ల అనంతరం థియేటర్లలో ఓపెన్ అయిన తొలి సినిమా ఇదే. దీంతో అందరి దృష్టి దీనిపై పడింది. అయితే మల్టీఫ్లెక్స్ ల్లో తొలి రోజు అయితే చాలా వరకూ సీట్లు ఫుల్ అయ్యాయి. అయితే కోవిడ్ నిబంధనల ప్రకారం 50 శాతం సీట్లకు మాత్రమే అనుమతిస్తున్నారు. ఒకప్పుడు వరస ఫ్లాప్ లతో సతమతం అయిన ఈ యువ హీరో చిత్రలహరి, ప్రతి రోజు పండగేలతో మళ్ళీ ట్రాక్ లోకి వచ్చాడు. ఇప్పుడు సోలో బ్రతుకే సో బెటర్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక సినిమా అసలు కథ ఏంటో టైటిల్ లోనే చెప్పేశారు. దీంతో దీనిపై ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పెళ్లి అంటే ఇష్టంలేని విరాట్‌ పాత్రలో సాయితేజ్‌ చక్కగా నటించాడు. పాత్రకు తగ్గట్లు కామెడీతో ఎమోషనల్‌ సీన్స్‌ లోనూ ఆకట్టుకున్నాడు. అమృత పాత్రలో నభా నటేశ్‌ తన పాత్రకు న్యాయం చేసింది. విరాట్‌ మామయ్యగా రావు రమేష్‌ మరోసారి సినిమా భారం మోశాడనే చెప్పొచ్చు. ఈ సినిమాలో వెన్నెల కిషోర్‌ కామెడీనే రిలీఫ్. ఇక విరాట్‌ ఫ్రేండ్‌గా సత్య కొంత మేర నవ్వించాడు. పెళ్లి అంటే ఇష్టంలేని హీరోల కథలతో గతంలో చాలా సినిమాలే వచ్చాయి.

దర్శకుడు సుబ్బు కథను చూపించే విధానం మాత్రం కాస్త కొత్తగా చెప్పే ప్రయత్నం చేశారు. మనిషికి తోడు అవసరమని, భాగస్వామి లేకుంటే ఎదురయ్యే ఇబ్బందులేంటో కళ్లకు కట్టినట్లు చూపించాడు. ఫస్టాఫ్ మొత్తం‌ ఎంటర్‌టైన్‌మెంట్‌తో నడిపించేశారు. హీరో హైదరాబాద్‌కు రావడం, ఫ్రెండ్స్‌ మారిపోయి పెళ్లి చేసుకోవడం, హీరో రియలైజ్‌ అయి పెళ్లి చేసుకోవాలను కోవడం అన్నీ చక చకా సాగుతాయి. ఇక ఇంటర్వెల్‌ ముందు హీరోయిన్‌ ఇచ్చే ట్విస్ట్‌ ఆసక్తికరంగా ఉంటుంది. ప్రీ క్లైమాక్స్‌ సాగదీతగా అనిపిస్తోంది. సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే.. పాటలతో పాటు.. బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌తో తమన్‌ మ్యాజిక్‌ చేశాడు. వెంక‌ట్ సి.దిలీప్‌ సినిమాటోగ్రఫీ బాగుంది. ఓవరాల్ గా చూస్తే కరోనా ఒత్తిడి సమయంలో ప్రేక్షకులకు కాస్త రిలీఫ్ ఇచ్చే సినిమా అని చెప్పొచ్చు.

రేటింగ్. 2.5/5


Tags:    

Similar News