సత్యదేవ్. నిత్యమీనన్. కొత్తదనం ఉన్న కథలు కోరుకునే వారు. కథల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటూ సాగుతున్నారు. అంతే కాదు..శనివారం నాడు విడుదలైన స్కైలాబ్ సినిమాలో కీలక పాత్ర పోషించిన నిత్యామీనన్ ఈ సినిమాకు సహనిర్మాతగా కూడా వ్యవహరించారు. ఇక సత్యదేవ్ విషయానికి వస్తే కథలో దమ్ము ఉండాలే కానీ పాత్రపై తనదైన ముద్ర వేయగల నటుడు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమానే ఈ స్కైలాబ్. సినిమా కథ అంతా కరీంనగర్ జిల్లాలోని బండలింగంపల్లి గ్రామం కేంద్రంగానే సాగుతుంది స్టోరీ అంతా. ఊరు..ఆ ఊరిలో ఉన్న గౌరీ (నిత్యామీనన్), డాక్టర్ ఆనంద్ (సత్యదేవ్), రాహుల్ రామక్రిష్ణల చుట్టూనే తిరుగుతుంది కథ. హైదరాబాద్ లో ప్రతిబింభం అనే పత్రికలో పనిచేసే గౌరీ (నిత్యామీనన్) జమీందార్ అయిన తన తండ్రికి ఆరోగ్యం బాగాలేదని ఊరికి వస్తుంది. ఆ సమయంలోనే పత్రిక ఎడిటర్ ఇక గౌరిని హైదరాబాద్ కు పంపొద్దని..ఆమె అసలు వార్తలు రాయటమే రాదని తేల్చిచెబుతాడు. ఈ విషయం తెలిస్తే ఎక్కడ బాధపడుతుందో అని ఈ లెటర్ కొన్నిరోజులు దాచిపెడతారు. డాక్టర్ ఆనంద్ రద్దు అయిన తన డాక్టర్ లైసెన్స్ పునరుద్దరణ కోసం తన తాత తనికెళ్ళ భరణి దగ్గర నుంచి పెన్షన్ డబ్బులు తీసుకెళదామని వస్తాడు. కానీ హీరో, హీరోయిన్లు ఇద్దరూ అక్కడే గ్రామంలో ఉండి తమ లక్ష్యాలను చేరుకునే ప్రయత్నం చేస్తారు. గౌరీ ఎంత ప్రయత్నం చేసినా ఆమె వార్తలు ఏ పత్రికలోనూ ప్రచురించరు.
అదే ఊరిలో ఆస్పత్రి పెట్టేందుకు ఆనంద్ ఎన్నో సమస్యలు ఎదుర్కొంటాడు. జర్నలిస్టుగా తనదైన ముద్ర వేసేందుకు గౌరి చేసే ప్రయత్నాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. తొలి భాగం అంతా దీనిపైనే కథ నడిపిస్తాడు దర్శకుడు. సెకండాఫ్ లో మాత్రం స్కైలాబ్ ఆ ఊరిలోనే పడుతుందనే వార్తలు రావటం, గౌరీ తన సత్తా చాటేందుకు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటుంది. అయితే ఆ గ్రామ ప్రజలు పడే టెన్షన్ ను దర్శకుడు విశ్వఖండేరావు ఆసక్తికరంగా మలచటంలో విఫలం అయ్యారు. సినిమా భారం అంతా కూడా నిత్యామీనన్ మీదే పడినట్లు కన్పిస్తుంది. ఆమె తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. ఆమె తల్లిగా నటించిన తులసి పాత్ర కూడా ఆకట్టుకుంటుంది. అయితే సత్యదేవ్ పాత్రకు సినిమాలో పెద్దగా స్కోప్ లేకపోయినా ఉన్నంతలో తన పాత్రకు న్యాయం చేశాడు. అయితే కథతో సంబంధం లేకుండా ఎలాంటి లవ్ ట్రాక్ పెట్టకుండా దర్శకుడు జాగ్రత్తలు తీసుకున్నాడు. 1979లో స్కైలాబ్ శకలాలు భూమి మీద పడి భారీ ఎత్తున ప్రాణ నష్టం జరుగుతుందనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇది ఇప్పటితరం వారికి చాలా మందికి తెలియదు. దర్శకుడు ఎంచుకున్న కథలో కొత్తదనం ఉన్నా ఈ కథను ఆసక్తికరంగా చెప్పటంలో విఫలం అయ్యారు. ఓవరాల్ గా చూస్తే 'స్కైలాబ్' సినిమా కూడా ఎక్కడాపడకుండానే పోయినట్లు అయింది.
రేటింగ్. 2.5\5