సరిలేరు నీకెవ్వరు హిట్ తర్వాత మహేష్ బాబు చేసిన సినిమా సర్కారువారి పాట. గీతగోవిందం వంటి సూపర్ డూపర్ హిట్ తర్వాత దర్శకుడు పరశ్ రామ్ తెరకెక్కించిన సినిమా ఇదే. దీంతో అంచనాలు ఎలా ఉంటాయో ఊహించుకోవచ్చు. ఈ సినిమాలోని పాటలు..ట్రైలర్ లతో ప్రచారం పీక్ కు వెళ్ళింది. అదే సమయంలో పరశ్ రామ్, మహేష్ బాబు కాంబినేషన్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. వీరిద్దరూ కలసి చేసిన తొలి సినిమా కూడా ఇదే కావటంతో అభిమానుల్లో అంచనాలు పెరిగాయి. సర్కారువారిపాట సినిమా గురువారం నాడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఇక సినిమా అసలు కథ విషయానికి వస్తే బ్యాంకుల నుంచి అప్పు తీసుకునే విషయంలో సామాన్య, మధ్య తరగతి ప్రజల స్పందన ఎలా ఉంటుంది. వేల కోట్ల రూపాయల అప్పులు తీసుకుని ఎగ్గొట్టే బడా బాబుల స్పందన ఎలా ఉంటుంది అనే లైన్ తీసుకుని దర్శకుడు పరశ్ రామ్ ఈ సినిమా తెరకెక్కించారు. చిన్న రైతులు.సామాన్యుల విషయంలో మాత్రం బ్యాంకులు భావోద్వేగాలకు అనుగుణంగా పనిచేయవు..నిబంధనలు ప్రకారం పనిచేస్తాయి అని చెప్పే బ్యాంకు ఉద్యోగులు...బడా బాబుల విషయంలో మాత్రం రాజకీయ ఒత్తిళ్ళు..కోర్టు ఆదేశాల పేరుతో ఎలా వ్యవహరిస్తాయో కళ్ళకు కట్టినట్లు చూపించారు. పదిహేను వేల రూపాయల బ్యాంకు రుణం చెల్లించలేక మహి (మహేష్ బాబు) తల్లితండ్రులు తమ పొలం వేలం వేస్తున్నారని అవమానంతో ఆత్మహత్య చేసుకుంటారు. చివరకు మిగిలిన ఒకే ఒక్క రూపాయితో అమెరికా చేరుకుంటాడు. పెద్దయ్యాక అక్కడ మహీ ఫైన్సాన్స్ కంపెనీ ఏర్పాటు చేసి అందరికీ రుణాలు ఇస్తుంటాడు.
తన అసిస్టెంట్ వెన్నెల కిషోర్ తో కలసి అప్పులిచ్చిన వారి దగ్గర నుంచి ఏ మాత్రం రాజీ లేకుండా వడ్డీలు..అసలు వసూలు చేస్తుంటాడు. ఆ క్రమంలోనే కళావతి (కీర్తిసురేష్) పరిచయం అవుతుంది మహీకి. దొరికిన ప్రతి చోటా అప్పులు చేస్తూ క్యాసినోల్లో ఆడుతూ...మందు తాగుతూ జల్సా చేసే కళావతి...చదువు కోవటానికి అని...మహీని బురిడీలు కొట్టించి పది వేల డాలర్లు తీసుకుంటుంది. కానీ అసలు విషయం తెలుసుకున్న మహీ తన అప్పు చెల్లించమంటే ఇవ్వను ఏమి చేసుకుంటావో చేసుకో పో అని చెబుతుంది. ఈ అప్పు వసూలు కోసం ఏకంగా అమెరికా నుంచి వైజాగ్ వస్తాడు మహీ. వైజాగ్ వచ్చి కళావతి తండ్రి దగ్గర పది వేల డాలర్లు వసూలుకు వచ్చి..చివరకు పది వేల కోట్ల రూపాయలు రాజేంద్రనాధ్ (సముద్రఖని) తనకు బాకీ ఉన్నాడు అని చెబుతాడు. పది వేల డాలర్లు కాస్తా..పది వేల కోట్ల రూపాయలు ఎలా అయింది..మరి రాజజేంద్రనాథ్ ఆ అప్పు చెల్లించాడా లేదా అన్నదే సినిమా.
సినిమా ఫస్టాఫ్ అంతా మహేష్ బాబు, వెన్నెల కిషోర్, కీర్తిసురేష్‌ల మధ్య వచ్చే సన్నివేశాలతో సరదా సరదాగా సాగిపోతుంది. సెకండాఫ్ లోనే సీరియస్ కథలోకి ప్రవేశించటం...భారీ ఫైట్లు సినిమాలో జోష్ ను తగ్గిస్తాయి. మహేష్ బాబు ఫస్టాఫ్ లో ఫుల్ గ్లామరస్ గా కన్పిస్తే..సెకండాఫ్ లో మాత్రం రఫ్ లుక్ లో ఉంటాడు. కీర్తిసురేష్ ఓ సరదా క్యారెక్టర్ చేసింది ఈ సినిమాలో. అయితే ఫస్టాఫ్ తో పోలిస్తే సెకాండాఫ్ లో కీర్తి సురేష్ పాత్ర చాలా తక్కువ. బ్యాంకు అధికారిగా నదియా పాత్ర..క్లైమాక్స్ లో ఆమెతో మహేష్ బాబు చెప్పే డైలాగ్ లు గుండెలు బరువెక్కిస్తాయి. ఈ సినిమాలో మహేష్ బాబు గతానికి భిన్నంగా కొన్ని పాటల్లో స్పీడ్ గా డ్యాన్స్ వేసి ఆకట్టుకున్నాడు. అయితే చిత్ర యూనిట్ ప్రచారం చేసుకున్నట్లుగా బ్లాక్ బస్టర్ ఏమీ కాదు..ఓ యావరేజ్ సినిమాగానే మిగిలిపోతుంది.
రేటింగ్. 2.75\5