దసరాకు ఎప్పటిలాగానే సినిమాల పండగ వచ్చింది. ఈసారి మూడు సినిమాలు విడుదల అయ్యాయి పండగకు. పాతికేళ్ల క్రితం ఇదే పేరుతో వచ్చిన 'పెళ్ళి సందడి' చేసిన సందడి అంతా ఇంతా కాదు. అప్పటి సినిమాలో శ్రీకాంత్, దీప్తి భట్నాగర్, రవళిల నటన సినిమాకు హైలెట్ గా నిలిచాయి. అంతే కాదు..ఈ సినిమాలో పాటలు ఓ సంచలనం. ఇప్పుడు అదే పేరుతో రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో గౌరీ రోణంకి దర్శకత్వంలో 'పెళ్ళి సందD' మూవీ రిపీట్ అయింది. ఇందులో ఒక్కటంటే ఒక్కటే విశేషం ఉంది. అది ఏంటి అంటే అప్పటి సినిమాలో హీరో శ్రీకాంత్ అయితే..ఇప్పటి సినిమాలో శ్రీకాంత్ తనయుడు రోషన్ కావటం ఒక్కటే. అంతే కానీ ఆ పెళ్లి సందడికి..ఈ పెళ్ళి సందడికి ఏ మాత్రం పోలికే లేదు. అప్పటి పెళ్లి సందడిలో కనీసం 25 శాతం ఫీల్ కూడా ఈ సినిమాలో కన్పించదు. ఓ రెండు పాటలు మినహా ఈ సినిమాలో చెప్పుకోదగ్గ విషయాలు ఏ మాత్రం లేవంటే అతిశయోక్తి కాదు. కథ, కథనం అత్యంత అత్యంత సాదాసీదా సాగిపోతాయి. అంతే కాదు ఈ సినిమాలో దర్శకుడు రాఘవేంద్రరావు కథ చెప్పిన విధానమే సినిమాకు పెద్ద మైనస్ గా మారింది.
అడవుల వెంట తిరుగుతూ రాఘవేంద్రరావు, రాజేంద్రప్రసాద్, శ్రీనివాసరెడ్డిలకు కథ చెప్పే తీరు అత్యంత బోరింగ్ గా సాగుతుంది. ఇక అసలు కథ విషయానికి వస్తే ఇద్దరు అక్కచెల్లెళ్లు. శ్రీలీల, వితిక. వితిక సంప్రదాయబద్దంగా ఉంటుంది. శ్రీశీల మాత్రం చలాకీగా ఉంటుంది. అక్కను చూసి నేర్చుకోమని తండ్రి ప్రకాష్ రాజ్ శ్రీలీలకు సలహాలు ఇస్తుంటాడు. ఒక రోజు వితిక చెప్పుకుండా ప్రేమించిన వ్యక్తితో మాయం అవుతుంది. దీంతో ఓ పెళ్లిలో మనసులు కలచిన రోషన్, శ్రీలీల ప్రేమకు చిక్కులు ఎదురవుతాయి. మరి ఈ సమస్యను పరిష్కరించి రోషన్, శ్రీలీల ఎలా ఒక్కటి అయ్యారు అన్నదే సినిమా. ఇలాంటి కథతో సినిమాలు ఇప్పటికే చాలా వచ్చాయి. పైగా ఇందులో కథనం కూడా ఏ మాత్రం ఆసక్తికరంగా లేదు. హీరో రోషన్ పాటల్లో చాలా వరకూ బాగానే కన్పించినా కొన్ని చోట్ల మాత్రం మరి తేలిపోయినట్లు కన్పిస్తాడు. కొత్త హీరోయిన్ శ్రీలీల మంచి అందంగా కన్పించినా..తొలి సినిమా కావటంతో నటనలో పరిణితి కన్పించదు. రాజశేఖర్ కూతురు శివానీ ఈ సినిమాలో ఓ ప్రత్యేక పాత్రలో కన్పిస్తుంది. ఓవరాల్ గా చూస్తే ఇది ఏ మాత్రం సందడి లేని సినిమా.
రేటింగ్. 2\5