సాయిధరమ్ తేజ్, ఐశ్వర్యా రాజేష్ లు జంటగా నటించిన సినిమా 'రిపబ్లిక్'. రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తరుణంలోనే సాయిధరమ్ తేజ్ కోరిక మేరకు శుక్రవారం నాడు సినిమాను విడుదల చేశారు. పరిపాలనలో అత్యంత కీలకమైన ఎగ్జిక్యూటివ్ వ్యవస్థతో రాజకీయ వ్యవస్థ ఎలా ఆడుకుంటుందో చెప్పిన సినిమానే 'రిపబ్లిక్'. అంతే కాదు..ఈ వ్యవస్థలో నిజాయతీగా ఉండాలంటే ఎంత కష్టమో..ఎన్ని సమస్యలు ఎదుర్కోవాలో రిపబ్లిక్ సినిమాలో కళ్ళకు కట్టినట్లు చూపించారు దర్శకుడు దేవా కట్టా. వర్తమాన రాజకీయాలకు సంబంధించిన పలు కీలక అంశాలను కూడా టచ్ చేయటం ద్వారా కొత్త చర్చకు తెరతీశారనే చెప్పొచ్చు. ఓ పార్టీ అధినేతగా విశాఖవాణి పాత్రలో రమ్యక్రిష్ణ తనదైన నటనతో ఆకట్టుకున్నారు. విశాఖవాణి పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే తన కొడుక్కు ఓ సలహా ఇస్తుంది. మొదటి మూడేళ్లు చేయాల్సిన మర్డర్లు..ఇతర పనులు అన్నీ చూసుకోమని చెబుతుంది. చివరి రెండేళ్ళు సంక్షేమ కార్యక్రమాలు చేపడితే సరిపోతుంది అంటూ మార్గనిర్దేశం చేస్తుంది. అంతే కాదు....తాము పరిశ్రమ ఏర్పాటుకు భారీగా పెట్టుబడి పెట్టామని..ఇప్పుడు పరిశ్రమ ఆగిపోతే..ఉద్యోగాలు పోతాయని..ఎకానమీ దెబ్బతింటుందని పారిశ్రామికవేత్తలు విశాఖవాణికి చెబుతుంటే...ఎకానమీ సంగతి మేం చూసుకుంటాం..మీరు మీ కంపెనీ సంగతి చూసుకోండి అంటూ ఆమె ఝలక్ ఇస్తుంది. అంతే కాదు..గత ప్రభుత్వానికి ఏమి ఇచ్చారో తమకూ అంతే ఇవ్వాలంటూ వారితో డిస్కషన్ క్లోజ్ చేస్తుంది.
గత ప్రభుత్వ టెండర్లలో అన్నీ అక్రమాలే జరిగాయని..తాము రివర్స్ టెండరింగ్ కు వెళతామని సీఎం చెప్పటంతో ఏపీలోని తాజా రాజకీయాలు గుర్తొస్తాయని చెప్పొచ్చు. అధికారంలో ఉన్న నేతల నిర్ణయాలు ప్రజల సంక్షేమం కంటే తమ ఓటు బ్యాంకు రాజకీయాలు..వ్యాపార అవసరాల కోసం ఎలా తీసుకుంటారో కళ్లకు కట్టినట్లు చూపించారు.ఓ పార్టీ అధినేతగా రమ్యక్రిష్ణ, కలెక్టర్ గా సాయిధరమ్ తేజ్ ల మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాలో హైలెట్ గా నిలుస్తాయి. ఏపీలోని కొల్లేరు ను రాజకీయ నేతలు, పారిశ్రామికవేత్తలు తమ రాజకీయ, ఆర్ధిక అవసరాలకు ఎలా ధ్వంసం చేశారో పేరు మార్చి చూపించారు. కోర్టు ఆదేశాల మేరకు చేపల చెరువులను ధ్వంసం చేశాక..మళ్ళీ ఎమ్మెల్యే తిరిగి అదే పనికి శ్రీకారం చుడుతుంటాడు. దీనికి గురించి ప్రశ్నించేందుకు వెళ్ళిన కలెక్టర్ కు..ఇప్పటి వరకూ మీ జాతి వాళ్లు దోచుకున్నారు..మరో నలభై ఏళ్లు మేం దోచుకున్నాక తర్వాత న్యాయం గురించి మాట్లాడదాం అంటూ చెప్పే డైలాగ్ అల్టిమేట్. హీరోయిన్ ఐశ్వర్యారాజేష్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత ఉండదు. అయితే రొటీన్ సినిమా ప్రేక్షకులు కోరుకునే కమర్షియల్, ఎంటర్ టైన్ మెంట్ అంశాలు ఏమీ ఇందులో ఉండవు. ప్రస్తుత రాజకీయ, అధికారిక వ్యవస్థల మధ్య సంఘర్షణను చూపించి..ఈ సమాజంలో నిజాయతీగా బతకటం కష్టం అని తేల్చేశారు దర్శకుడు దేవా కట్టా. రాజకీయాలు అంటే ఆసక్తిఉన్న వారికి నచ్చే సినిమా ఈ 'రిపబ్లిక్' .
రేటింగ్. 2.75\5