రవి తేజ, హరీష్ మ్యాజిక్ వర్క్ అవుట్ అయిందా?!(Mr. Bachchan Movie Review)

Update: 2024-08-15 00:38 GMT

 రవి తేజ లేటెస్ట్ మూవీస్ టైగర్ నాగేశ్వర్ రావు , ఈగల్ లు బాక్స్ ఆఫీస్ వద్ద మిశ్రమ స్పందనలకే పరిమితం అయ్యాయి. ఇప్పుడు మిస్టర్ బచ్చన్ అనే రీమేక్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఈ ఎనర్జిటిక్ హీరో. ఇది బాలీవుడ్ లో రైడ్ పేరుతో తెరకెక్కిన మూవీనే. దర్శకుడు హరీష్ శంకర్ టాలీవుడ్ అభిరుచులకు అనుగుణంగా ఇందులో మార్పులు చేసి ఈ సినిమాపై పెద్ద ఎత్తున బజ్ క్రియేట్ చేయటంలో విజయవంతం అయ్యాడు. హీరోయిన్ భాగ్య శ్రీ బోర్సే కూడా ఈ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది అనటంలో ఏ మాత్రం సందేహం లేదు. ఆగస్ట్ 15 రెండు కీలక సినిమాలు మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్ విడుదల ఉండటంతో రవి తేజ సినిమా మాత్రం ఆగస్ట్ 14 రాత్రి నుంచి ప్రీమియర్ షోస్ వేశారు. టీజర్, ట్రైలర్, పాటలు మిస్టర్ బచ్చన్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. మరి పెరిగిన ఈ అంచనాలను రవి తేజ సినిమా అందుకుందా..లేదో చూద్దాం.

సినిమా కథ విషయానికి వస్తే రవి తేజ సిన్సియర్ ఐటి అధికారి. తాను ఎంత పెద్ద వాళ్లపై అయినా ఐటి రైడ్స్ చేయటానికి వెనుకాడడు. అదే సమయంలో స్వయంగా ప్రధాని చెప్పినా సరే మధ్యలో రైడ్ నుంచి వెనక్కి తగ్గడు. సజహంగా నిజాయతీగా ఉండే అధికారులకు ఉండే ఇబ్బందులే ఇక్కడ రవి తేజకు కూడా ఎదురవుతాయి. మరి ఈ ఇబ్బందులు అన్ని అధిగమించి మిస్టర్ బచ్చన్ తన డ్యూటీ ఎలా చేశాడు అన్నదే సినిమా. సినిమా ప్రారంభంలోనే ఒక బ్యాంకు దగ్గర దోపిడీ, రవి తేజ ఎంట్రీ...పెళ్లి చూపుల హంగామాతో జోష్ నింపాడు దర్శకుడు హరీష్ శంకర్. ఫస్ట్ ఫస్టే చేసింది ఒక పెద్ద వ్యాపారి పై ఐటి రైడ్ కావటంతో పై నుంచి వత్తిళ్లు వచ్చి సస్పెండ్ అవుతాడు. దీంతో సొంత ఊరికి వెళ్లి ఫ్రెండ్స్ తో కలిసి ఆర్కెస్ట్రా ట్రూప్ నడుపుతాడు. అక్కడే హీరోయిన్ తో పరిచయం...ప్రేమగా మారుతుంది. మరి సస్పెండ్ అయిన మిస్టర్ బచ్చన్ కు తిరిగి ఎలా ఉద్యోగం వచ్చింది...ఆ తర్వాత ఆయన చేసిన రైడ్ లో జరిగింది ఏమిటి అన్నదే సినిమా. సినిమా రీమేక్ కావటం...టీజర్, ట్రైలర్ లోనే హీరో ఐటి అధికారి అనే విషయం తేలిపోయింది.

మరి చాలా మందికి ముందే తెలిసిన కథను ఆసక్తికరంగా చెప్పటం అంటే అది పెద్ద టాస్క్. అయితే ఈ విషయంలో చాలా వరకు దర్శకుడు హరీష్ శంకర్ సక్సెస్ అయ్యారు అనే చెప్పాలి. అత్యంత రొటీన్ కథకు..స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆకట్టుకునే డైలాగులతో నడిపించేశాడు. ఎప్పుడైతే సినిమా స్లో అవుతుంది అనే ఫీలింగ్ వస్తుందో..ఆ వెంటనే ఏదో ఒక సన్నివేశంతో..ఆకట్టుకునే డైలాగులతో షో రన్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ లో సినిమా అలా ముందుకు సాగిపోతుంది. కానీ సెకండ్ హాఫ్ లో ఎక్కువ భాగం  ఐటి రైడ్ చుట్టూనే తిరగటంతో కాస్త స్లో అవుతుంది. సీరియస్ కథలో కామెడీ ని నడిపించే బాధ్యతను సత్య, చమ్మక్ చంద్ర లు తీసుకున్నారు. ఫస్ట్ హాఫ్ లో ఎక్కువ సత్య నడిపిస్తే సెకండ్ హాఫ్ లో చమ్మక్ చంద్ర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాడు.

ఎవరూ ఊహించని రీతిలో ఈ సినిమాలో సిద్దు జొన్నలగడ్డ గెస్ట్ అప్పీరెన్స్ తో అదరగొడతాడు. సిద్దు తెరపై ఉండేది కొద్ది సేపే అయినా తనదైన మార్క్ డైలాగులు, ఫైట్స్ తో సినిమాలో జోష్ తెస్తాడు. రాజకీయ నేపథ్యం ఉన్న విలన్ గా జగపతి బాబు పాత్ర సాగుతుంది. రవి తేజ ఎంట్రీ దగ్గర నుంచి..సిద్దు స్పెషల్ ఎంట్రీ వరకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విషయంలో మిక్కీ జె మేయర్ మేయర్ దుమ్మురేపాడు అనే చెప్పాలి. ఇది ఒక్కటే కాదు..పాటలు కూడా సినిమా విడుదలకు ముందే సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. హీరో రవి తేజ ఐటి అధికారి గా తన పాత్రలో ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు అదే ఎనర్జిటిక్ గా కనిపిస్తాడు. హీరోయిన్ భాగ్య శ్రీ బోర్సే ఫస్ట్ సినిమానే అయినా తన నటన, పాటలతో ఆకట్టుకుంది . ఒక్క మాటలో చెప్పాలంటే రొటీన్ కథను దర్శకుడు హరీష్ శంకర్ తన మార్క్ డైలాగులతో బోర్ కొట్టకుండా నడిపే ప్రయత్నంలో చాలా వరకు సఫలం అయ్యాడు.

                                                                                                                                                                                                                                               రేటింగ్: 2 .75 /5

Tags:    

Similar News