ఆర్ ఎక్స్ 100. కార్తికేయకు ఒక్కసారిగా యూత్ లో మంచి ఫాలోయింగ్ తెచ్చిపెట్టింది. యూత్ కు కావాల్సిన మాస్ మసాలాలు ఉండటంతో ఆ సినిమా సూపర్ హిట్ అయింది. అప్పటి నుంచి కార్తికేయ చాలా సినిమాల్లో నటించినా ఒక్కటంటే ఒక్కటి కూడా ఓ మాదిరి హిట్ కూడా దక్కించుకోలేకపోయాడు. ఇప్పుడు ఎన్నో ఆశలతో ఒకప్పటి చిరంజీవి టైటిల్ 'రాజా విక్రమార్క' తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. టైటిల్ అయితే పెట్టుకున్నారు కానీ..ఆ టైటిల్ కు కావాల్సినంత కథ, కథనం, మసాలాలు. కామెడీ వంటివి సమకూర్చటంలో విఫలం అయ్యారు. ఇక సినిమా అసలు కథ విషయానికి వస్తే హోం మంత్రి (సాయికుమార్ )కి మావోయిస్టుల నుంచి ముప్పు ఉంటుందని నివేదిక వస్తుంది. ఆ ముప్పు నుంచే తప్పించే పనిలో తనికెళ్ల భరణి సారధ్యంలో పనిచేసే ఎన్ ఐఏ టీమ్ లో అధికారిగా కార్తికేయ. సినిమాలో పోషించింది ఎన్ఐఏ ఆఫీసర్ పాత్రే అయినా అసలు ఆ సీరియస్ నెస్ ఎక్కడా కన్పించదు. ప్రారంభం నుంచి చివరి వరకూ కార్తికేయ పాత్ర అంతా అలా సో సో గానే సాగిపోతుంది. మధ్యలో మధ్యలో కూసిన్ని ట్విస్ట్ లు వచ్చినా సినిమాను నిలబెట్టేందుకు అవి ఏ మాత్రం సరిపోవు అనే చెప్పాలి. పోనీ లవ్ ట్రాక్ ఏమైనా ఆసక్తికరంగా ఉందా అంటే అదీ లేదు. తాన్యా రవిచంద్రన్ ఈ సినిమాలో కార్తికేయకు జోడీగా నటించింది.
హోం మంత్రి కూతురు అయి ఉండి బానెట్ మూసేస్తే ఆగిపోయే కారుతో రోడ్ల మీద తిరుగుతూ కన్పించే అమ్మాయితో అలా ప్రేమలో కనెక్ట్ పోతాడు హీరో. మరి మావోయిస్టుల టార్గెట్ హోం మంత్రి అనుకుని ఎన్ ఐఏ టీమ్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటే ..మావోయిస్టులు అందుకు భిన్నంగా ఓ డ్యాన్స్ ప్రదర్శన చేస్తున్న హోం మంత్రి కూతురిని కిడ్నాప్ చేస్తారు. మరి హోం మంత్రిని, ఆయన కూతురిని ఈ టీమ్ ఎలా రక్షించింది అన్నదే సినిమా. కార్తికేయ డ్యాన్స్ లతోపాటు నటన, ఫైట్స్ విషయంలో తనదైన మార్క్ చూపించగలడు. కానీ ఆయనకు కాలం కలసి రావటం లేదో..కథల ఎంపికలో పొరపాటో తెలియదు కానీ చేసిన సినిమాలు అన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి. హీరోయిన్ తాన్యా రవిచంద్రన్ తమిళంలో పలు సినిమాలు చేసినా టాలీవుడ్ లోకి ఈ సినిమాతోనే ఎంట్రీ ఇచ్చింది. సుధాకర్ కోముకల కూడా ఈ సినిమాలో కీలక పోలీస్ అధికారి పాత్రలో నటించాడు. పోలీసు అధికారిగా, ఆ తర్వాత హోం మంత్రిగా నటించిన సాయికుమార్ తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. కథ అందించి ఈ సినిమాకు దర్శకత్వం వహించిన శ్రీ సరిపల్లి 'రాజా విక్రమార్క' టైటిల్ కు దగ్గ జోష్ నింపటంలో విఫలం అయ్యారు.
రేటింగ్. 2\5