'పుష్ప‌క‌విమానం' మూవీ రివ్యూ

Update: 2021-11-12 10:08 GMT

విచిత్రం ఏమిటంటే ఈ శుక్ర‌వారం విడుద‌లైన రెండు తెలుగు సినిమాల టైటిల్స్ గ‌తంలో వ‌చ్చిన పాపుల‌ర్ మూవీసే. రాజా విక్ర‌మార్క చిరంజీవి సినిమా అయితే..పుష్ప‌క విమానం సినిమా క‌మ‌ల‌హాస‌న్ ది. ఇలా పాత పేర్ల‌తో వ‌చ్చిన కొత్త సినిమాలు రెండూ ఒకే రోజు విడుద‌ల కావ‌టం విశేషం. ఆనంద్ దేవ‌ర‌కొండ‌. విజ‌య్ దేవ‌రకొండ సోద‌రుడిగా ఓ ప్ర‌త్యేక గుర్తింపు ద‌క్కించుకున్నారు. ఆ గుర్తింపుతో వ‌ర‌స పెట్టి సినిమాలు చేస్తూ త‌న‌దైన ముద్ర వేసే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. చాలా వ‌ర‌కూ త‌న‌కూ సూట్ అయ్యే క‌థ‌ల‌తోనే ప్ర‌యోగాలు చేస్తున్నాడు. అందులో భాగంగా వ‌చ్చిన‌వే దొరసాని, మిడిల్‌ క్లాస్‌మెలోడీస్‌. ఇప్పుడు మ‌రోసారి పుష్ప‌క విమానం తో ప్రేక్షకుల ముందుకు వ‌చ్చాడు. ఈ సినిమా నిర్మాతల్లో విజ‌య్ దేవ‌ర‌కొండ కూడా ఒక‌రు కావ‌టంతో దీనిపై అంచ‌నాలు మ‌రింత పెరిగాయి. అంతే కాదు..త‌మ్ముడి సినిమా కోసం చేయాల్సిన ప్ర‌య‌త్నం అంతా చేశాడు విజ‌య్. ఇక సినిమా అస‌లు క‌థ విష‌యానికి వ‌స్తే చిట్టిలంక సుందర్‌(ఆనంద్‌ దేవరకొండ) ఓ ప్రభుత్వ టీచ‌ర్. అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో తెలియని అమాయ‌కుడు. అతనికి మీనాక్షి(గీత్‌ సైని)తో వివాహం జరుగుతుంది. అయితే పెళ్లైయిన కొద్ది రోజులకే మీనాక్షి వేరొకరితో లేచిపోతుంది.

ఈ విచిత్ర పరిస్థితిని ఎదుర్కొనేందుకు సుందర్ ప‌డ్డ క‌ష్టాలు ఏంటి?. అసలు మీనాక్షి ఎందుకు లేచిపోయింది? భార్య లేచిపోయిందనే విషయాన్ని ఎవ‌రికీ తెలియ‌కుండా సుందర్ చేసిన ప్ర‌య‌త్నాలు ఏమిటి అన్న‌దే ఈ సినిమా. ల‌ఘ చిత్రాల్లో న‌టించే రేఖ ( శాన్వి మేఘ‌న‌)ను త‌న భార్య‌గా న‌టించ‌మ‌ని తీసుకొస్తాడు సుంద‌ర్. మిస్సింగ్ కేసును చేధించేందుకు పోలీసు అధికారిగా రంగా(సునీల్‌) ఎంట్రీ ఇస్తాడు. ప్రభుత్వ టీచ‌ర్ చిట్టిలంక సుందర్‌ పాత్రలో ఆనంద్‌ ఒదిగిపోయాడు. భార్య పారిపోయిందనే విషయం బయటకు తెలిస్తే పరువు పోతుందని, దానికి కప్పిపుచ్చడానికి సుందర్‌ చేసే పనులు అందరిని నవ్విస్తాయి. మీనాక్షిగా గీత్‌ సైని మెప్పించింది. కథ మొత్తం తన పాత్ర చుట్టే తిరుగుతుంది. కానీ తెరపై ఆమె క‌న్పించే స‌మ‌యం చాలా తక్కువ. సుందర్‌ భార్యగా న‌టించిన రేఖ పాత్రలో శాన్వీ మేఘన బాగా సెట్ అయింది. వెబ్‌సీరీస్‌, షార్ట్‌ ఫిల్మ్‌లు తీసే పాత్ర తనది. తెరపై మాస్‌ లుక్‌లో కనిపిస్తుంది. పోలీసు అధికారిగా సునీల్‌ సీరియస్‌ లుక్‌లో కనిపిస్తూనే తనదైన పంచ్‌లతో నవ్వించాడు.

పెళ్ళైన కొద్దిరోజులకే భార్య మిస్సయిందనే ఆసక్తికర పాయింట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు దామోదర. డైరెక్టర్‌ ఎంచుకున్న పాయింట్‌ కొత్తగా ఉన్నప్పటికీ.. తెరపై మాత్రం క‌థ‌ను ఆస‌క్తిక‌రంగా మల‌చ‌టంలో త‌డ‌బ‌డ్డాడు. హీరో భార్య మిస్సయిందనే పాయింట్‌ చుట్టూనే కథ తిరుగుతుంది. భార్య కనిపించడం లేదని పోలీస్ కంప్లైంట్స్ ఇస్తే పరువు పోతుందని.. తనే వెతకడం ప్రారంభిస్తాడు. ఈ క్రమంలో వచ్చే కొన్ని సీన్స్‌ కడుపుబ్బా నవ్విస్తాయి. అదే సమయంలో కొన్ని సీన్స్‌ సాగదీతగా అనిపించి ప్రేక్షకుడి సహనానికి పరీక్షపెడతాయి. మీనాక్షిని ఎవరు హత్య చేశారనే విషయాన్ని చివరివరకూ చెప్పకుండా, సెకండాఫ్‌లో కథను ఆసక్తికరంగా నడిపించాడు. పోలీసు విచారణ మాత్రం నాటకీయంగా సాగడం సినిమాకు మైనస్‌.కథలో భాగంగానే పాటలు వస్తాయి తప్ప తెచ్చిపెట్టినట్లు ఎక్కడా అనిపించదు. పుష్ప‌క విమానం అక్క‌డ‌క్క‌డ న‌వ్విస్తుంది కానీ.. ఒవ‌రాల్ గా చూస్తే అంత బాగా పైకి ఎగ‌ర‌లేద‌నే చెప్పాలి.


రేటింగ్.2.25\5

Tags:    

Similar News