కథ కంటే కామెడీనే నమ్ముకున్నారు(Mathu Vadalara 2 Movie Review)

Update: 2024-09-13 11:05 GMT

ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాల్లో అందరి దృష్టిని ఆకర్షించిన మూవీ మత్తువదలరా 2 . దీనికి ప్రధాన కారణం నాలుగు సంవత్సరాల క్రితం వచ్చిన ఫస్ట్ పార్ట్ మత్తువదలరానే. ఆ సినిమాకి కొనసాగింపుగా ఇప్పుడు పార్ట్ టూ విడుదల చేశారు. ఎలా చూసినా కూడా ఈ సినిమా దర్శకుడు రితేష్ రానా కథ కంటే కూడా ఎక్కువగా కామెడీనే నమ్ముకుని ఈ సినిమాని తెరకెక్కించినట్లు కనిపిస్తుంది. ఎందుకంటే ఏదో సో సో కథతో కామెడీ తోనే సినిమా లాగించాలని ప్లాన్ చేశాడు. ఇక్కడ మరో కీలక విషయం ఏమిటి అంటే ఈ సినిమాలో పేరుకు హీరో శ్రీసింహ అయినా అసలు హీరో మాత్రం సత్య అనే చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమా భారం మొత్తం మోసింది సత్యనే కాబట్టి. లుక్ పరంగా శ్రీసింహ చూడటానికి ఒకే అనిపించినా కొన్ని సందర్భాల్లో ఆయన ఎక్సప్రెషన్స్ తేలిపోతాయి. శ్రీసింహ తో పాటు సత్య, ఫరియా అబ్దుల్లా, సునీల్ లు అంతా హీ టీం (హెడ్ అఫ్ ఎమర్జెన్సీ) లో పనిచేస్తారు.

                                                                                      వీళ్ళ ప్రధాన బాధ్యత ముఖ్యంగా కిడ్నప్ కేసు లు ఛేదించటం. ఈ కిడ్నాప్ కేసు లు ఛేదించే క్రమంలో బ్లాక్ మెయిలర్స్ డిమాండ్ చేసిన డబ్బుల్లో కొంత భాగాన్ని శ్రీసింహ, సత్యాలు కొట్టేస్తుంటారు. హీ టీం ప్రధాన లక్ష్యం బ్లాక్ మెయిలర్స్ నుంచి బాదితులను కాపాడటం తప్ప..డబ్బు ప్రధాన కాదు అన్న విషయాన్ని హై లైట్ చేస్తూ ఈ డబ్బు తస్కరణకు కూడా జస్టిఫికేషన్ ఇచ్చుకుంటారు వీళ్ళిద్దరూ. ఒక సారి హీ టీం కు ఏ మాత్రం సంబంధం లేకుండా తమ దగ్గరకు వచ్చిన ఒక కిడ్నాప్ కేసు ను సాల్వ్ చేసి ..దీని ద్వారా వచ్చే రెండు కోట్ల రుపాయలతో సెటిల్ అవుదామనుకుంటారు శ్రీసింహ, సత్యలు. అక్కడే కథ రివర్స్ కొడుతుంది. కిడ్నాప్ సమస్యను సాల్వ్ చేయటం కాదు కదా...వీళ్ళే ఒక మర్డర్ కేసు లో ఇరుక్కుంటారు. ఆ తర్వాత జరిగిన మలుపులు ఏంటి...అసలు డబ్బు కు ఆశపడి ప్రైవేట్ గా కేసు టేకప్ చేసిన వీళ్ళ ఇద్దరికి ఎదురైనా సమస్యలు ఏంటి అన్నదే సినిమా. ఈ వ్యవహారం లో అక్కడక్కడా ట్విస్ట్ లు ఉన్నా కూడా అవి అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోవు అనే చెప్పొచ్చు.

                                                        కాస్తో కూస్తో ఈ సినిమాను నిలబెట్టింది అంటే సత్య కామెడీ ట్రాక్ అనే చెప్పాలి. శ్రీసింహ, సత్య కాంబినేషన్ లో వచ్చిన సన్నివేశాలు ప్రేక్షకులను నవ్విస్తాయి. ఇటీవల సంచలనం సృష్టించిన హేమ డ్రగ్ కేసు ను కూడా ఈ సినిమాలో ప్రస్తావించారు. దీంతో పాటు సత్య చాలా చోట్ల నందమూరి బాలకృష్ణ మ్యానరిజమ్స్ ప్రదర్శిస్తారు. హీ టీం లో కీలక ఆఫీసర్ గా ఫరియా అబ్దుల్లా ఆకట్టుకుంటుంది. మరో వెరైటీ పాత్రలో వెన్నెల కిషోర్ తనదైన మార్క్ చూపించాడు. ఈ సినిమా లో ప్రధానంగా వచ్చే ఓరి నా కొడకా సీరియల్ సీన్స్ అసలైన సీరియల్స్ ను మించి ఉంటుంది. ఫస్ట్ పార్ట్ తో పోలిస్తే మత్తువదలరా 2 సినిమాలో కామెడీ ఓకే అనిపించినా..ప్రేక్షకులను ఎంగేజ్ చేసే విషయాలు మిస్ అయ్యాయి . ఒక్క మాటలో చెప్పాలంటే ఈ మత్తువదలరా 2 సినిమా కోసం డబ్బులు వదిలించుకోవాల్సిన అవసరం లేదు అనే చెప్పొచ్చు. దీని ఫలితం చూసిన తర్వాత అతి త్వరలోనే ఇది ఓటిటి లోకి రావటం ఖాయం.

                                                                                                                                                                                                                                                         రేటింగ్: 2 .25 /5  

Tags:    

Similar News