సినీ ప్రేక్షకులకు ఈ దీపావళి ప్రత్యేకం అని చెప్పాలి. ఎందుకంటే గతంలో ఎన్నడూలేని రీతిలో ఏకంగా నాలుగు సినిమా లు ఈ సారి విడుదల అయ్యాయి. ఈ నాలుగు సినిమాల్లో అందరి దృష్టిని ఆకర్షించినవి లక్కీ భాస్కర్ ఒకటి అయితే..మరొకటి కిరణ్ అబ్బవరం నటించిన క సినిమా. పాన్ ఇండియా లో స్థాయిలో గుర్తింపు ఉన్నా కూడా ప్రధానంగా ఒక మలయాళ హీరో తెలుగు లో స్ట్రెయిట్ మూవీస్ తో హ్యాట్రిక్ విజయం సాధించటం అంటే అది ఒక రికార్డు గానే చెప్పాలి. మధ్యలో డబ్బింగ్ సినిమాలు కూడా ఎన్నో విజయవంతమైన మూవీస్ తో దుల్కర్ ఆకట్టుకున్నాడు. అందులో ఒకటి కనులు కనులు దోచాయంటే. దుల్కర్ సల్మాన్ తెలుగు లో నటించిన మహానటి, సీతారామంలు సూపర్ డూపర్ హిట్ కాగా..ఇప్పుడు లక్కీ భాస్కర్ సినిమా కూడా మంచి విజయాన్ని దక్కించుకుంది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ లక్కీ భాస్కర్ సినిమా ప్రీమియర్ షో లు హైదరాబాద్ లో పెద్ద ఎత్తున వేశారు. చిత్ర యూనిట్ కు సినిమా విజయంపై ఎంతో ధీమా ఉండటంతో విడుదల కు ఒక రోజు ముందే పెద్ద ఎత్తున ప్రియమిర్ షోస్ వేశారు అని చెప్పొచ్చు. ఇండియన్ స్టాక్ మార్కెట్స్ ను కుదిపేసిన హర్షద్ మెహతా స్కాం విషయంలో బ్యాంకు లు ఎలాంటి పాత్ర పోషించాయి. కుటుంబాన్ని పోషించటానికి ఇబ్బంది పడే సాధారణ ఉద్యోగి భాస్కర్ తన ప్రమోషన్ కోసం పడే తంటాలు...తర్వాత ఏకంగా వంద కోట్లు తన ఖాతాలో పెట్టుకునే స్థాయికి ఎలా ఎదిగాడు అన్నదే ఈ సినిమా.
ఒక వైపు ఫ్యామిలీ ఎమోషన్స్.. మరో వైపు ఫేక్ బ్యాంకు రిసిప్ట్ ల ఆధారంగా బ్యాంకు డబ్బును స్టాక్ మార్కెట్ లో ఎలా ఉపయోగించారు అన్నది పర్ఫెక్ట్ గా చూపించారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సినిమాను దుల్కర్ సల్మాన్ ఒంటి చేత్తో నడిపించాడు. సాధారణ ఉద్యోగిగా...డబ్బు లేని సమయంలో పడే ఇబ్బందులు...తర్వాత ఫ్రెండ్ తో కలిసి బ్యాంకు డబ్బును తన స్నేహితుడి అక్రమ వ్యాపారానికి అందిస్తూ ప్రయోజనం పొందే సమయంలో చూపించే ఎమోషన్స్..పడే టెన్షన్ సినిమాలో హై లైట్ అని చెప్పొచ్చు. సినిమా ప్రారంభం నుంచి క్లైమాక్స్ వరకు దుల్కర్ సల్మాన్ నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సినిమా లో వచ్చే ట్విస్ట్ లు..సంభాషణలు లక్కీ భాస్కర్ సినిమా ను ఒక రేంజ్ లో నిలబెట్టాయి. ఈ సినిమా లో దుల్కర్ సల్మాన్ కు జోడిగా నటించిన మీనాక్షి చౌదరికి మంచి పాత్ర దక్కింది .
దర్శకుడు వెంకీ అట్లూరి కథను ఆసక్తికరంగా చెప్పటంలో ఎంత విజయవంతం అయ్యారో ..అదే తరహాలో తన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ద్వారా సినిమా ను జీవి ప్రకాష్ ఒక రేంజ్ కు తీసుకువెళ్లాడు. సినిమా అంతా ముంబై చుట్టూనే తిరుగుతుంది. 1990 ల నాటి ముంబై ని..స్టాక్ మార్కెట్ లావాదేవాలను చూపించిన తీరు కూడా ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో సాయి కుమార్, రాంకీ, టిను ఆనంద్, సచిన్ ఖేద్కర్ లు తమ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. లక్కీ భాస్కర్ సినిమా తో టాలీవుడ్ లో దుల్కర్ సల్మాన్ హ్యాట్రిక్ విజయాన్ని దక్కించుకున్నారు అనే చెప్పాలి. అయితే ఈ మూవీ బి, సి సెంటర్లలో ని ప్రేక్షకులకు ఏ మేరకు కనెక్ట్ అవుతుంది అన్నది వేచిచూడాల్సిందే.
రేటింగ్ : 3 /5