'క్రాక్' సినిమా సూపర్ హిట్ తర్వాత రవితేజ చేసిన సినిమా 'ఖిలాడి'. దీంతో శుక్రవారం నాడు విడుదలైన ఖిలాడి సినిమాపై రవితేజ అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. తాజాగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో థియేటర్లలో కూడా సందడి పెరిగింది. రవితేజ ఒక్కరే కాదు..ఖిలాడి మూవీలో చాలా మంది నటులే ఉన్నారు. ఒకప్పటి యాక్షన్ హీరో అర్జున్, ఉన్ని ముకుందన్ లు కూడా ఇందులో కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాలో రవితేజకు జోడీగా డింపుల్ హయతి,మీనాక్ష్మి చౌదరిలు సందడి చేశారు. రవితేజకు డబ్బు అంటే పిచ్చి. డబ్బు కోసం ఏమైనా చేస్తాడు. ఈ డబ్బు సంపాదన కోసం ఓ గ్యాంగ్ ను తయారుచేసుకుంటాడు. పది వేల కోట్ల రూపాయలను ఎమ్మెల్యేలకు పంచి హోం మంత్రిగా ఉన్న ముకేష్ రుషి సీఎం అయ్యేందుకు ప్రయత్నిస్తాడు. ఈ పది వేల కోట్ల రూపాయలను ఎలాగైనా కొట్టేయాలని ఖిలాడి రవితేజ ప్రయత్నాలు చేస్తాడు. మరో వైపు హోం మంత్రి తెప్పించిన ఆ పది వేల కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకునేందుకు సీబీఐ ఆఫీసర్ గా నటించిన అర్జున్ ప్రయత్నాలు.
సినిమా అంతా పది వేల కోట్ల రూపాయల చుట్టూనే తిరుగుతుంది. అయితే అసలు ఈ డబ్బును రవితేజ ఎందుకు కొట్టేయాలనుకుంటాడు. మధ్యలో ఈ పది వేల కోట్ల రూపాయల నగదును ఫేక్ కరెన్సీతో మార్చింది ఎవరు? అంతిమంగా ఇది ఎవరి దగ్గరకు చేరుతుంది అన్నదే సినిమా. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా రొటీన్ గా సాగిపోతుంది. కానీ ఇంటర్వెల్ ముందు వచ్చే ట్విస్ట్ తో సినిమాపై ఒక్కసారిగా అంచనాలు మారిపోతాయి. ఫస్టాఫ్ చివరిలో వచ్చే ట్విస్ట్...ఫైట్ సినిమాకే హైలెట్ అని చెప్పొచ్చు. వాస్తవానికి రావు రమేష్ కంపెనీలో ఉద్యోగిగా పనిచేసే రవితేజ కంటే...ఖిలాడి రవితేజ ఎంట్రీ ఇచ్చాకే సినిమాలో కాస్త ఊపు వస్తుంది. అసలు కథ కంటే ఈ సినిమాలో చాలా ఉప కథలు వచ్చి ప్రేక్షకులను కాస్త గందరగోళంలోకి నెడతాయి. ఇప్పటికే వందల సినిమాల్లో చూసినట్లు హీరోయిన్ తండ్రే ఓ విలన్ గా ఉండటం, పదవి కోసం డబ్బులు పంచటానికి విదేశాల నుంచి బారీ మొత్తం నగదు రప్పించటం..దాన్ని కొట్టేసే ప్రయత్నాలు చాలా సినిమాల్లో చూసీ చూసీ ఇప్పటికే ప్రేక్షకులు విసిగిపోయారనే చెప్పొచ్చు.
దర్శకుడు రమేష్ వర్మ ఈ సినిమా విషయంలో అసలు కథ కంటే ట్విస్ట్ లను ఎక్కువగా నమ్ముకున్నట్లు కన్పిస్తుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ లో వచ్చే ట్విస్ట్ తోపాటు ఆస్పత్రిలో రవితేజ ఇచ్చే ఝలక్, అప్పటి వరకూ రవితేజతో కలసి ఉన్న డింపుల్ హయతి ఇచ్చే ట్విస్ట్ లు ప్రేక్షకులకు అక్కడక్కడ థ్రిల్ నిస్తాయి. ఈ సినిమాలో డింపుల్ హయతి గ్లామర్ షో తోపాటు ఆమెకు స్క్రీన్ స్పేస్ ఎక్కువ ఉంది. మరో హీరోయిన్ మీనాక్ష్మి చౌదరిది నామమాత్రపు పాత్రే. ఖిలాడిగా రవితేజ తనకు అలవాటైన పాత్ర కావటంతో ఆకట్టుకున్నాడు. హీరోయిన్లలో పాటలు..పాత్ర హంగామా అంతా డింపుల్ హయతితే. మురళీశర్మ, రావు రమేష్, వెన్నెల కిషోర్ , అనసూయలవి రొటీన్ పాత్రలే. ఓవరాల్ గా చూస్తే ఖిలాడి అక్కడక్కడ తప్ప అంత కిక్కేమీ ఇవ్వడు.
రేటింగ్. 2.5\5