'గుడ్ ల‌క్ స‌ఖీ' మూవీ రివ్యూ

Update: 2022-01-28 09:56 GMT

వాయిదాల మీద వాయిదాల అనంత‌రం కీర్తి సురేష్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన గుడ్ ల‌క్ స‌ఖీ సినిమా శుక్ర‌వారం నాడు విడుద‌లైంది. ఈ సినిమాలో ఆది పినిశెట్టి, జ‌గ‌ప‌తిబాబులు ఇత‌ర కీల‌క పాత్ర‌లు పోషించారు. న‌గేష్ కుకునూర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల‌ను ఆక‌ట్టుకోవ‌టంలో విష‌ల‌మైంద‌నే చెప్పాలి. స‌ఖి (కీర్తిసురేష్‌)కు ఊరిలో ఓ పేరు ఉంది. ఆమె ఎదురొస్తే చాలు..ప్ర‌తి ఒక్క‌రికి ఏదో ఒక న‌ష్టం జ‌రుగుతుంద‌నే భ‌యం ఉంటుంది. అలాగే స‌ఖి ఎదురొచ్చిన ప్ర‌తిసారి ఏదో ఒక రూపంలో వారు ప్ర‌మాదం బారిన ప‌డుతూనే ఉంటారు. ఆది పినిశెట్టి ఈ సినిమాలో గోలిరాజు న‌టించాడు. స‌డ‌న్ గా గోలిరాజు నాట‌కాలు ఆడుతూ ఆ ఊరిలోకి ఎంట్రీ ఇస్తాడు. వాస్త‌వానికి చిన్న‌ప్ప‌టి నుంచి గోలిరాజు, స‌ఖి ఇద్ద‌రూ మంచి ఫ్రెండ్స్. స‌ఖికి కొన్ని గోలీలు ఇచ్చి ఆట ఆడిస్తాడు రాజు. స‌ఖి గురిచూసి కొట్టింది అంటే చాలు..గోలీ ఎగిరిప‌డాల్సిందే. అలా కొన్ని గోలీల‌ను ల‌క్కీ గోలీలుగా న‌మ్ముతారు వీరిద్ద‌రూ. అప్ప‌టి నుంచి వాటిని స‌ఖి వెంట పెట్టుకునే ఉంటుంది. అయితే గురిచూసి గోలీల‌ను కొట్టే స‌ఖికి జ‌గ‌ప‌తిబాబు షూటింగ్ లో శిక్షణ ఇచ్చి ఎలా తీర్చిదిద్దాడు.

ఈ శిక్షణా స‌మ‌యంలో గోలీరాజుకు, స‌ఖికి దూరం పెర‌గ‌టం. మ‌ధ్య‌లో ఎదుర‌య్యే స‌వాళ్లు ఏమిటి అన్న‌దే సినిమా. స‌ఖి పాత్ర‌లో కీర్తి సురేష్ ఆక‌ట్టుకుంది. ముఖ్యంగా గ్రామీణ యువ‌తి పాత్ర‌లో...త‌ర్వాత షూటింగ్ శిక్షణ పొందే స‌మ‌యంలో త‌న‌దైన న‌ట‌న చూపించింది. ఆది పినిశెట్టి పాత్ర‌కు పెద్ద‌గా ప్రాధాన్య‌త లేదనే చెప్పాలి. షూటింగ్ లో శిక్షణ ఇచ్చే గురువుగా జ‌గ‌ప‌తిబాబు పాత్ర బాగానే ఉన్నా..ఇందులో మెరుపులు అంటూ ఏమీ క‌న్పించ‌వు. అయితే సినిమాలో ప‌లుమార్లు వాయిస్ సింక్ మిస్ అయిన‌ట్లు క‌న్పిస్తోంది. అంతే కాదు..మ‌రీ లో బ‌డ్జెట్ సినిమా అనే ఫీల్ క‌లిగేలా నిర్మాణం ఉంది. సినిమా లైన్ బాగానే ఉన్నా...గేమ్స్ డ్రామాలో ఉండే గ్రిప్పింగ్ నెస్...ఉత్కంఠ ఇందులో ఎక్క‌డా క‌న్పించ‌వు. ఈ సినిమాలో అస‌లు ఫీల్ లేకుండా పోయింద‌నే చెప్పాలి. ఏదో డ్రామాలాగా స్లోగా సాగుతూ పోవ‌టంతో ప్రేక్షకుల‌కు సినిమా చూస్తున్న ఫీల్ కూడా రాదు.ఓవ‌రాల్ గా చూస్తే గుడ్ ల‌క్ స‌ఖి ప్రేక్షకుల‌ బ్యాడ్ ల‌క్ అని చెప్పుకోవాల్సిందే.

రేటింగ్. 2\5

Tags:    

Similar News