వెంకటేష్. రీమేక్ సినిమాల హీరోగా మారాడు. మొన్న నారప్ప. నేడు దృశ్యం 2. దృశ్యం తొలి భాగం ఎంత సూపర్ హిట్టో అందరికీ తెలిసిందే. ఇప్పుడు దృశ్యం 2'పై కూడా అదే అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా గురువారం నాడు అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో విడుదలైంది. దృశ్యం సినిమాలో హత్య కేసును చేధించేంచేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలు సినిమాలో హైలెట్ గా నిలుస్తాయి. అదే సమయంలో కొడుకును కోల్పోయిన పోలీసు అధికారిణిగా నదియా, నరేష్ దంపతులు, కూతురు, భార్యను కాపాడేందుకు హీరో వెంకటేష్ చేసే ప్రయత్నాలు..ఇరు కుటుంబాల మధ్య జరిగే సంఘటనల భావోద్వేగాలు సినిమాకు జీవం పోశాయి. సరిగ్గా దృశ్యం ఎక్కడ ఆగిపోయిందో దృశ్యం2 సినిమా అక్కడే మొదలవుతుంది. తొలి భాగంలో కేబుల్ ఆపరేటర్ గా ఉన్న హీరో వెంకటేష్ రెండవ భాగంలో మాత్రం ఓ థియేటర్ ఓనర్ గా మారటంతో పాటు..సినిమా నిర్మించే ప్రయత్నాలు కూడా చేస్తాడు. ఇది అంతా కూడా కథతో పర్పెక్ట్ గా కనెక్ట్ అయిన వ్యవహారంగానే సాగుతుంది.
తన ఇంట్లో హత్యకు గురైన వరుణ్ అనే యువకుడి శవాన్ని రాంబాబు (వెంకటేశ్) నిర్మాణంలో ఉన్న పోలీస్ స్టేషన్ లో పాతిపెట్టడంతో 'దృశ్యం' సినిమా ముగుస్తుందనే విషయం తెలిసిందే. రెండవ పార్ట్ లో పోలీసులు ఈ కేసును రహస్యంగా విచారణ జరిపిస్తూనే ఉంటారు. రాంబాబు జీవితంసాఫీగా సాగుతున్నప్పటీకీ.. వరుణ్ కేసు తాలూకు భయాలు మాత్రం అతడి కుటుంబాన్ని వెంటాడుతూనే ఉంటాయి. పోలీసులు ఎక్కడ కనిపించినా చాలు రాంబాబు భార్య జ్యోతి(మీనా, పిల్లలు అంజు (కృతిక), అను( ఏస్తర్ అనిల్) భయంతో వణికిపోతుంటారు. ఎలాగైనా రాంబాబు మీద పగ తీర్చుకోవాలని భావించిన గీత(నదియా)... తన స్నేహితుడు, పోలీసు అధికారిగా ఉన్న గౌతమ్ సాహు(సంపత్ రాజ్)సఆయంతో మళ్లీ ఆ కేసును రీఓపెన్ చేయిస్తుంది. సరికొత్త సాక్ష్యాలతో రాంబాబు కుటుంబాన్ని కోర్టుకు ఈడ్చినప్పుడు ఈసారి రాంబాబు ఎలా బయటపడ్డాడు అనేదే 'దృశ్యం 2' రాంబాబు పాత్రలో వెంకటేశ్ తన సత్తా చాటాడు. దృశ్యం మాదిరే.. ఇందులో కూడా కథ మొత్తాన్ని తన భుజాన వేసుకొని నడిపించాడు. సెకండాఫ్‌లో వచ్చే ఎమోషనల్ సీన్స్‌ని అద్బుతంగా పండించాడు. రాంబాబు పిల్లలుగా కృతిక, ఎస్తర్ అనిల్ కు తమ పాత్రల పరిధిమేరకు నటించారు.
. కుమారుడిని కోల్పోయిన తల్లిదండ్రులుగా నదియా, నరేశ్ తమ పాత్రల్లో చక్కగా నటించారు. ఐజీగా సంపత్ రాజ్, కానిస్టెబుల్‌గా సత్యం రాజేశ్, రాంబాబు లాయర్ గా పూర్ణ, రచయితగా తనికెళ్ల భరణితో పాటు మిగిలిన నటీ,నటులు ఈ సినిమాలో కొత్త పాత్రలు. అయినా సినిమాలో వీరివి కీలక పాత్రలు. ఈ సినిమా మలయాళ వర్షన్ ఇప్పటికే అమెజాన్ ప్రైమ్‌లో విడుదలై సూపర్ హిట్ అయింది. మళ్లీ తెలుగు ప్రేక్షకుల కోసం దర్శకుడు జీతూ జోసెఫ్ ఫ్రెష్ లుక్‌తో ఈ మూవీని తెరకెక్కించాడు. మాతృకతో పోలిస్తే.. తెలుగు వర్షన్‌లో కొన్ని మార్పులు చేశాడు దర్శకుడు. పస్టాఫ్ లో కొంత భాగం రొటీన్ గా అన్పించినా సినిమా గడిచే కొద్దీ ట్విస్టుల మీద ట్విస్టులతో ఆసక్తికరంగా మారుతుంది. సెకండాఫ్‌లో కథ చాలా స్పీడ్‌గా వెళ్తుంది. కేసు నుంచి తన ఫ్యామిలీని కాపాడుకునేందుకు రాంబాబు వేసే ఎత్తులు, పైఎత్తులు చాలా ఉత్కంఠభరితంగా సాగుతాయి. దృశ్యం 2' సినిమా దర్శకుడు జీతూ జోసెఫ్ దర్శకత్వ ప్రతిభకు నిదర్శనమనే చెప్పాలి. తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా ప్రతి ఫ్రేమ్‌ని అందంగా, ఉత్కంఠభరితంగా తీర్చిదిద్దాడు. తన కథనే సినిమాగా తీయాలనుకుని, ఓ పేరున్న రచయితతో పుస్తకం సిద్ధం చేయించి..దీని ఆధారంగా పోలీసులు కేసును తప్పుదోవ పట్టించారనేలా క్లైమాక్స్ లో ఇచ్చిన ట్విస్ట్ అదిరిపోతుంది. ఒవరాల్ గా'దృశ్యం2' ప్రే క్షకులను ఆకట్టుకోవటమే కాదు.. వెంకటేష్ కెరీర్ లో ఓ మంచి సినిమాగా మిగిలిపోతుంది.
రేటింగ్. 3.5\5