ఈ సమ్మర్ సీజన్ లో భారీ సినిమాలు..చిన్న సినిమాలు వరస పెట్టి సందడి చేస్తున్నాయి. భారీ సినిమాల మధ్య వీలు చూసుకుని చిన్న సినిమాలు కూడా పనికానిస్తుస్తున్నాయి. ఆచార్య సినిమా బాక్సాఫీస్ వద్ద ఫట్ మనటంతో ఈ శుక్రవారం నాడు ఏకంగా మూడు సినిమాలు ముందుకొచ్చాయి. అందులో భళా తందనానా ఒకటి అయితే మరోకటి విశ్వక్ సేన్ హీరోగా నటించిన అశోక్ వనంలో అర్జున కళ్యాణం, జయమ్మ పంచాయతీ ఉన్నాయి. ఇక భళా తందనానా విషయానికి వస్తే టైటిల్ లోనే వెరైటీ ఉంది. శ్రీవిష్ణు మంచి కథ దొరికితే చాలు ఆకట్టుకుంటాడు. అయితే ఈ మద్య ట్రాక్ తప్పుతోంది. క్యాథరిన్ థ్రెసా. తెలుగు తెరపై మెరిసి చాలా కాలమే అయింది. ఇప్పుడు శ్రీవిష్ణుతో కలసి భళా తందనానా సినిమాతో ముందుకొచ్చింది. ఇక సినిమా అసలు కథ విషయానికి వస్తే చందు (శ్రీవిష్ణు) ఓ ఆనాధ అశ్రమంలో అకౌంటెంట్ గా పనిచేస్తాడు. ఓ సారి అనాథ ఆశ్రమంపై ఐటి శాఖ దాడులు చేస్తుంది. ఈ వార్త కవర్ చేయటానికి శశిరేఖ (కేథరిన్) వెళుతుంది. అక్కడి మేనేజర్ ఎలాగైనా ఈ వార్త పత్రికలో రాకుండా చూడాలని కావాలంటే జర్నలిస్టుకు 25 వేలు లంచం ఇవ్వాలని చెబుతాడు.
వెంటనే చందు అదే పనిలో నిమగ్నం అవుతాడు. శశిరేఖ డబ్బులు తీసుకోకపోతే ఏకంగా ఆఫీసుకు ఓ కొత్త బండి తీసుకెళ్ళి ఇస్తాడు. అందుకూ ఆమె అంగీకరించకపోవటంతో ఎంతో మంది అనాథ పిల్లలు అందులో బతుకుతున్నారని..ఐటి రైడ్స్ అని వార్త వస్తే వచ్చే విరాళాలు ఆగిపోతాయని..నిజం ఉంటే వార్త రాసినా అభ్యంతరంలేదని కన్విన్స్ చేస్తాడు చందు. అక్కడ నుంచి వారిద్దరి మధ్య పరిచయం పెరిగి..ప్రేమగా మారుతుంది. వేల కోట్ల రూపాయల హవాలా లావాదేవీ కేసును ఇన్వెస్టిగేట్ చేస్తున్న శిశరేఖకు వరస హత్యలు షాక్ ఇస్తాయి. ఈ కేసు పరిశోధనలో చందు ఎలా సాయం చేశాడు..అసలు వీటి వెనక ఉన్నది ఎవరు అన్నదే అసలు సినిమా. ఈ సినిమాకు దర్శకుడు చైతన్య దంతులూరి ఎంచుకున్న పాయింట్ కొత్తగా ఉంది. క్రైమ్ థ్రిల్లర్‌కి కామెడీ, ప్రేమను యాడ్ చేసి అన్ని రకాల ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు.
కథలో కావాల్సినన్ని ట్విస్టులు, ఉత్కంఠ రేకెత్తించే సీన్స్ ఉన్నప్పటికీ.. కామెడీ, లవ్ ట్రాక్ కారణంగా రొటీన్ సినిమాగా మారిపోయింది. అదే సమయంలో స్లోగా సాగినట్లు అవుతుంది. వరుస హత్యలు.. హీరో, హీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్‌తో ఫస్టాఫ్ సాదాసీదాగా సాగుతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ ఆకట్టుకోవటమే కాకుండా అసలు కథ అంతా అక్కడ నుంచే..ట్విస్ట్ లు కూడా ఆసక్తిరేపుతాయి. అసలు హీరో గతం ఏమిటి? హవాలా కింగ్ నుంచి కొట్టేసిన 2000 కోట్లు ఎక్కడ దాచాడు? అనే విషయాలను తెలియజేయకుండా.. రెండో భాగం ఉందని చెప్తూ కథని ముగించారు. నటీనటుల విషయానికి వస్తే శ్రీవిష్ణు తన పాత్రకు న్యాయం చేశాడు. ఫస్టాఫ్‌లో అమాయక చక్రవర్తిగా, సెకండాఫ్‌లో ఢిఫరెంట్ షేడ్స్ ఉన్న వ్యక్తిగా తనదైన నటనతో మెప్పించాడు. ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుగా కేథరిన్ మెప్పించే ప్రయత్నం చేసింది. ఒవరాల్ గా చూస్తే భళాతందనానా ఓ టైమ్ పాస్ మూవీ.
రేటింగ్. 2.25\5