రాజ్ తరుణ్. చాలా కాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. కానీ ఒక్కటీ కలసి రావటం లేదు. ఈ తరుణంలో అన్నపూర్ణ స్టూడియోస్, శ్రీవెంకటేశ్వరా సినిమా బ్యానర్ పై సంయుక్తంగా నిర్మించిన సినిమా 'అనుభవించురాజా'. శుక్రవారం నాడు విడుదలైంది. ఈ సినిమాలో రాజ్ తరుణ్ కు జోడీగా కాశీష్ ఖాన్ నటించింది. ఆమెకు ఇది తొలి సినిమానే. సినిమా అసలు కథ విషయానికి వస్తే రాజ్ తరుణ్ తాత భారీ ఎత్తున ఆస్తి సంపాదిస్తాడు. ఊరినిండా పొలాలు..చేపలు చెరువులు. చేతినిండా డబ్బులు. కానీ డబ్బుమాత్రం పైసా ఖర్చు పెట్టడు. అడ్డుక్కునేవాడికి కూడా రూపాయి ఇవ్వడు. పైగా రూపాయి పాపాయి లాంటిది ఖర్చు పెట్టకూడదు..పెంచుకుంటూ పోవాలని చెబుతాడు.కొడుకు కొత్త కారు కొందామన్నా అవసరం లేదంటూ డొక్కు కారుతోనే నడిపిస్తాడు. అలా అదే కారులో గుడికి వెళ్లి వస్తూ లారీ గుద్ది రాజ్ తరుణ్ తప్ప అందరూ చనిపోతారు. కొనఊపిరితో ఉన్న తాత మనవడికి మాత్రం తాను ఏ మాత్రం ఖర్చు పెట్టకుండా డబ్బు సంపాదించానని..ఆస్తిని అనుభవించాలని చనిపోతూ మనవడికి హితబోధ చేస్తాడు. కానీ సడన్ గా పెద్దైన మనవడు జైల్లో దర్శనం ఇస్తాడు. ఆస్తిని అనుభవించాల్సిన వ్యక్తి జైలుకు ఎందుకు వెళతాడు అన్న సస్పెన్స్ తో సినిమా ప్రారంభం అవుతుంది. బెయిల్ పై బయటకు వచ్చాక హైదరాబాద్ లో ఓ ఐటి కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తాడు. అదే సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేసే అమ్మాయి కాషిష్ ఖాన్ తో ప్రేమలో పడతాడు. సెక్యూరిటీ గార్డు ఉద్యోగం చేసే రాజ్ తరుణ్ కూడా తనలాగే ఐటి ఉద్యోగం చేస్తున్నాడని పొరపాటుపడుతుంది హీరోయిన్.
ఐటి కంపెనీ సెక్యూరిటీ గార్డు ఉద్యోగం చేస్తూనే తనను హత్య చేయాల్సిందిగా ఓ క్రిమినల్ గ్యాంగ్ కు సుఫారీ ఇస్తాడు. తన హత్యకు తానే ఎందుకు సుఫారీ ఇచ్చాడనే విషయం తెలియక ప్రేయసితోపాటు స్నేహితుడు సుదర్శన్ కూడా అవాక్కు అవుతారు. అక్కడ నుంచే అసలు కథ ప్రారంభం అవుతుంది. ఊరిలో ఎవరో చేసిన తప్పు తన మీద పడటంతో ఈ నిజాన్ని కనుక్కొనేందుకే ఈ సుఫారీ ప్లాన్ వేస్తాడు. సినిమా ఫస్టాఫ్ అంతా సరదా సరదాగా సాగిపోతుంది. సెకండాఫ్ లోనే అసలు ట్విస్ట్ లు ఉంటాయి. తొలి సినిమా అయినా హీరోయిన్ కాషిష్ ఖాన్ ఆకట్టుకుంటుంది. ఇతర కీలక పాత్రల్లో నటించిన పోసాని క్రిష్ణమురళీ, ఆడుకాలం నరేన్ లు తమ పాత్రలకు న్యాయం చేశారు. ఈ సినిమాలో అరియానా గ్లోరీ ప్రత్యేక పాత్రలో కన్పించినా దీని గురించి పెద్దగా చెప్పుకోవటానికి ఏమీలేదు. దర్శకుడు శ్రీను గవిరెడ్డి సినిమాను ఆసక్తికరంగా మలచటంలో విఫలమయ్యారని చెప్పొచ్చు. పదవుల కోసం సొంత కుటుంబ సభ్యులే హత్యలకు ప్లాన్ వేసిన కథలు గతంలో చాలా సినిమాల్లో చూసినవే. అందుకే ఇందులో కూడా ఏ మాత్రం కొత్తదనం అన్పించదు. ఒవరాల్ గా చూస్తే 'అనుభవించురాజా' సినిమా చూసి ప్రేక్షకులు అంతగా అనుభవించాల్సిన ఆనందాలు ఏమీ అందులో లేవనే చెప్పొచ్చు. కాకపోతే ఓ టైమ్ పాస్ మూవీ.
రేటింగ్. 2.5\5