శర్వానంద్ గత కొంత కాలంగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్నాడు. సిద్ధార్ధ్ తో కలసి చేసిన మహాసముద్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. దీంతో 'ఆడవాళ్ళు మీకు జోహర్లు' సినిమాపై ఈ హీరో భారీ ఆశలే పెట్టుకున్నాడు. సినిమాకు సంబంధించిన టీజర్, ట్రైలర్ కూడా సినిమాపై అంచనాలు భారీగా పెంచాయి. ఇది దర్శకుడు కిషోర్ తిరుమల కావటంతో ఈ సినిమాపై అందరిలో ఆసక్తి నెలకొంది. ఈ సినిమా శుక్రవారం నాడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. పెళ్లి ఎప్పుడు చేసుకోవాలా అని తాపత్రయపడే కుర్రాడిగా చిరు (శర్వానంద్), తన స్వీయానుభావాలతో పెళ్ళిపై ఏ మాత్రం సదభిప్రాయం లేని కుష్భూ కుమార్తెగా ఆద్య(రష్మిక మందన) ల మధ్య జరిగే సంఘర్షణే ఈ సినిమా. సహజంగా ప్రతి ఇంట్లో ముగ్గురు, నలుగురు ఆడవాళ్లు ఉండటం సహజం. కానీ ఇక్కడ ఏకంగా ఒకే ఇంట్లో పదిహేను మంది ఆడవాళ్లు..పెళ్లి కావాల్సిన ఓ యువకుడు మాత్రమే ఉంటే అతగాడి పరిస్థితి ఏంటి?. ఆ పెళ్లి ప్రయత్నాలు అంత సాఫీగా సాగుతాయా?. ఆ యువకుడికి అసలు పెళ్లి అవుతుందా అన్నదే ఈ సినిమా. చూసిన అమ్మాయిలు ఎవరూ ఇంట్లో వాళ్లకు నచ్చక..ప్రతి అమ్మాయికి ఏదో ఒక వంక పెట్టి తప్పించటం..అందరికీ పెళ్లిళ్ళు అయిపోతున్నాయి.
తన పెళ్లి ఎప్పుడు అవుతుందా అనే టెన్షన్ పడే యువకుడి పాత్రలో శర్వానంద్ నలిగిపోతాడు. తాను అమ్మాయిలను తిరస్కరించే పరిస్థిత నుంచి చివరకు తనను అమ్మాయిలు రిజెక్ట్ చేసే పరిస్థితి కల్పించారంట్లూ ఇంట్లోని ఆడవాళ్ల మధ్య నలిగిపోయే యువకుడి పాత్రలో శర్వానంద్ ఆకట్టుకుంటాడు. ఈ సినిమాలో శర్వానంద్ తల్లి రాధిక నటించారు. పెళ్లి కోసం తాపత్రయపడే యువకుడి పాత్రలో శర్వానంద్ తన నటనతో ఆకట్టుకుంటాడు. రష్మిక మందన కూడా తల్లి మాట జవదాటని కుమార్తెగా తన పాత్రకు న్యాయం చేసింది. అయితే సినిమాను ఆసక్తికరంగా మలచటంలో దర్శకుడు కిషోర్ తిరుమల తడబడ్డారు. అక్కడక్కడ వెన్నెల కిషోర్ కామెడీ, సీరియస్ టైమ్ లో ఊర్వశి యాక్షన్స్ ఆకట్టుకుంటాయి. మిగిలిన వారి పాత్రలు చాలా పరిమితమే అని చెప్పుకోవాలి. ఓవరాల్ గా చూస్తే 'ఆడవాళ్ళు మీకు జోహర్లు' ఓ రొటీన్ సినిమాగానే మిగిలిపోతుంది.
రేటింగ్. 2.5\5