'30 రోజుల్లో ప్రేమించటం ఎలా?' మూవీ రివ్యూ

Update: 2021-01-29 10:13 GMT

ఈ సినిమా ప్రచారమే 'పాటంత బాగుంటుంది' అంటూ చేస్తున్నారు. కానీ వాస్తవంగా చూస్తే పాట బాగుంది. కానీ సినిమా బాగాలేదనే చెప్పాలి. ఈ మొత్తం సినిమాలో ఓ రెండు పాటలు బాగున్నాయి. లొకేషన్లు బాగున్నాయి. బుల్లితెరపై ఓ వెలుగు వెలుగుతున్న ప్రదీప్ మాచిరాజు నటనకు వంకలు పెట్టాల్సింది పెద్దగా ఏమీలేకపోయినా కథ కారణంగా సినిమా మాత్రం చాలా నీరసంగా సాగుతుంది. చూస్తున్నంత సేపూ ప్రేక్ష‌కులు అసహనంతో కూర్చోవాల్సిన పరిస్థితి. స్వాతంత్రానికి ముందు ఓ లవ్ ట్రాక్. బాక్సింగ్ అంటే చచ్చిపోయేంత ప్రేమ ఉన్న ప్రదీప్...బాక్సింగ్ వదిలేసి ఇంట్లో వాళ్ళు చెప్పినట్లు పెళ్ళి చేసుకుందామని కోరే ప్రియురాలు అమృతా అయ్యర్. తాను ప్రేమించిన అమ్మాయికి వేరేవాళ్ళతో పెళ్ళి అయిపోతుందని బాక్సింగ్ పోరులోనే ప్రాణాలు వదిలే హీరో.

ప్రేమించిన వ్యక్తిని కాకుండా మరొకరిని పెళ్లి చేసుకోవాల్సి వస్తుందనే కారణంతో ప్రాణాలొదిలేసిన హీరోయిన్. వాళ్ళిద్దరికి పునర్జన్మ. కాలేజీలో పరిచయం. వీరి కథను చెప్పే స్వామిజీ. మధ్యలో ఒకరు అంటే ఒకరికి ఏ మాత్రం సరిపడని వీళ్లిద్దరి శరీరాలు అటు ఇటు మారిపోవటం. ఈ ఎపిసోడ్ అంతా కూడా ప్రేక్ష‌కుల సహనానికి పెద్ద పరీక్ష‌ పెట్టిందనే చెప్పాలి. దర్శకుడు మున్నా ఎంచుకున్న పునర్జన్మల కథను తెరపై చూపించడంలో బోల్తా కొట్టారనే చెప్పాలి. హీరో, హీరోయిన్ల మధ్య వచ్చిన ప్రేమ సన్నివేశాలు కూడా ఏ మాత్రం ఫీల్ కల్పించేవి ఉండవు. ఓవరాల్ గా చూస్తే ఈ సినిమా ఏ మాత్రం జీవంలేని 'ప్రేమ కథ'.

రేటింగ్. 2/5

Tags:    

Similar News