టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరు అయిన ఎన్టీఆర్ నేరుగా బాలీవుడ్ లో చేసిన ఫస్ట్ మూవీ వార్ 2 . గతంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లు కలిసి నటించిన ఆర్ఆర్ఆర్ హిందీ లో విడుదల అయినా కూడా అది తెలుగు నుంచి హిందీ లోకి డబ్ అయింది. ఇప్పుడు నేరుగా మరో హీరో హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ నటించిన సినిమా వార్ 2 . ఈ సినిమా ఆగస్ట్ 14 న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అధికారం నాడు హైదరాబాద్ లో జరిగింది. ఇందులో ఎన్టీఆర్ చేసిన కామెంట్స్ తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. దివంగత నందమూరి తారకరామారావు ఆశీస్సులు ఉన్నత కాలం తనను ఎవరూ ఆపలేరు అని ఎన్టీఆర్ ఈ ఈవెంట్ లో వ్యాఖ్యానించారు. అసలు ఎన్టీఆర్ సడన్ గా తనను ఎవరూ ఆపలేరు అని ఎందుకు అంత సీరియస్ గా స్పందించారు...దీని వెనక ఉన్న కథ ఏమిటి అన్న చర్చ తెర మీదకు వస్తోంది. ఎన్టీఆర్ వార్ 2 సినిమా కు ఎవరైనా ఇబ్బందులు కలిపించాలని చూస్తున్నారా...చూస్తుంటే వాళ్ళు ఎవరు అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కారణాలు ఏంటో కానీ వార్ 2 సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎన్టీఆర్ ఎక్కువ శాతం చాలా చాలా సీరియస్ గానే కనిపించారు.
ఒక దశలో ఫ్యాన్స్ పై ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ పరిశ్రమలోకి వచ్చి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. దేవుడు చల్లగా చూస్తే ఇంకొన్నేళ్లు ఇలాగే ముందుకు వెళ్తా... నేను ఒక్కడినే కాదు... మీ అందరి తోడుగా అంటూ ఫ్యాన్స్ ను ఉద్దేశించి మాట్లాడారు. ఇక్కడ మరో కీలక విషయం ఏమిటి అంటే ఎవరెన్ని కామెంట్స్ చేసినా కూడా వార్ 2 బొమ్మ అదిరిపోయింది అన్నారు. ఈ సినిమాలో ఎన్నో ట్విస్ట్ లు ఉన్నాయన్నారు. ఈ సినిమా హిందీ సినిమా కాదు..తెలుగు సినిమా అని ఎన్టీఆర్ వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ లు నటించిన ఈ సినిమా పై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా కు తెలుగు లో ప్రముఖ నిర్మాత నాగ వంశీ డిస్ట్రిబ్యూటర్ గా ఉన్నారు. ఎన్టీఆర్ ఆశీస్సులు ఉన్నత వరకు తనను ఎవరూ ఆపలేరు అని...ఎవరు ఎన్ని కామెంట్స్ చేసినా కూడా వార్ 2 బొమ్మ అదిరిపోవుతుంది అని చెప్పటం తో ఈ సినిమా ను టాలీవుడ్ లో ఎవరైనా టార్గెట్ చేశారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఒకప్పుడు ఎన్టీఆర్ సినిమాలను టీడీపీ శ్రేణులు టార్గెట్ చేసి దెబ్బకొట్టే ప్రయత్నాలు చేశాయి. కారణాలు ఏమైనా టీడీపీ, ఎన్టీఆర్ ల మధ్య గత కొన్ని సంవత్సరాలుగా గ్యాప్ పెరుగుతూ పోతోంది. ఈ తరుణంలో ఎన్టీఆర్ తాజాగా వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.