ఇంటి పేరు ‘క్లిక్’...కొడుకుల పేర్లు క్యానన్..నికాన్..ఎప్సన్

Update: 2020-07-15 13:17 GMT

కొంత మందికి తమ వృత్తి అంటే ఎంతో అభిమానం ఉంటుంది. కానీ మరీ ఇంతలా కాదు. ఈ ఫోటోగ్రాఫర్ మాత్రం తన వృత్తితో అంతగా కనెక్ట్ అయిపోయాడు. అది ఎంతలా అంటే తన కొడుకులకు ఏకంగా కెమెరాల పేర్లే పెట్టేశాడు. అంతే కాదు..ఇప్పుడు కొత్తగా కట్టుకున్న ఇంటికి కూడా ‘క్లిక్’ అని నామకరణం చేశాడు. అలా కేవలం పేరు పెట్టి వదిలేయలేదు. ఇంటిని కూడా అచ్చం కెమెరా మోడల్ లోనే నిర్మించుకున్నాడు. అదే అసలు విశేషం. బయట నుంచే చూస్తే ఆ ఇళ్లు ఓ కెమెరాను చూస్తున్నట్లే ఉంటుంది. లోపల కూడా అంటే బెడ్ రూమ్ మొదలుకుని కిచెన్ వంటి కూడా అంతా కెమెరాల్లోని భాగాల తరహాలోనే ఉండటం విశేషం. కర్ణాటకలోని బెలగావికి చెందిన రవి అనే ఫోటోగ్రాఫర్ చేసిన వినూత్న ప్రయోగం ఇది. 71 లక్షల రూపాయల వ్యయంతో రవి ఈ ‘క్లిక్’ అనే ఇంటిని నిర్మించగా..ఇప్పుడు అది ఆ ప్రాంతంలో ఎంతో పాపులర్ ఇళ్ళుగా మారిపోయింది.అంతే కాదు చాలా మంది అక్కడకు వచ్చి సెల్ఫీలు దిగుతున్నారు కూడా.

రవి అనే ఈ ఫోటో గ్రాఫర్ తన ముగ్గురు కొడుకులకు వరసగా క్యానన్, నికాన్, ఎప్సన్ అనే పేర్లు పెట్టాడు. ఈ ఇళ్ళు బెళగావిలోని శాస్త్రినగర్ లో ఉంది. తన కలల ఇంటిని నిర్మించుకోవటానికి రెండున్నర సంవత్సరాలు పట్టిందని తెలిపారు. ఈ ఇంటికి సంబంధించిన ఆసక్తికర కథనాలను పలు జాతీయ మీడియా సంస్థలు ప్రచురించాయి. సోదరుడు కూడా ఫోటోగ్రాఫర్ కావటంతో చిన్నప్పటి నుంచే తనకు ఈ రంగంపై ఆసక్తిపెరిగిందని రవి తెలిపాడు. తొలుత తన కుమారులకు కెమెరాల పేర్లు పెట్టడం తన తల్లిదండ్రులకు ఏ మాత్రం నచ్చలేదని..కానీ తన భార్య మాత్రం ఫోటోగ్రపీపై తనకున్న ప్యాషన్ చూసి ప్రోత్సహించిందని వెల్లడించారు. ముందు తన పిల్లలకు ఈ పేర్లు అర్ధం కాకపోయినా పెద్ద అయిన తర్వాత మాత్రం తన ఆసక్తిని గమనించి గర్వంగా ఫీల్ అవుతున్నట్లు తెలిపారు.

Similar News