ఒక్క మాటలో చెప్పాలంటే ఇది మీడియాకు గడ్డుకాలం. అగ్రరాజ్యం అమెరికా దగ్గర నుంచి మొదలుపెడితే భారత్ లోని పలు రాష్ట్రాల్లో మీడియా ప్రస్తుతం గతంలో ఎన్నడూ లేని విచిత్ర పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఒక్క మాటలో చెప్పాలంటే చాలా చోట్ల మీడియాపై ‘అప్రకటిత నిషేధం’ అమలు అవుతోంది. ఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాసినా ఇక్కట్లు తప్పేలా లేవు. దీంతో చాలా వరకూ యాజమాన్యాలు కూడా సరెండర్ అయిపోయా సర్కారు ఇచ్చే కోట్లాది రూపాయల ప్రకటనల ఆదాయం తీసుకుంటూ అసలు విషయాలను వదిలేస్తున్నాయి. అమెరికాలో అయితే ట్రంప్ అధ్యక్షుడు అయిన దగ్గర నుంచి మీడియాతో ఆడుకుంటున్నారు. అసలు మీడియాను డోంట్ కేర్ అంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు..చేస్తూనే ఉన్నారు. తాజాగా అమెరికాలో జరిగిన ఓ సంఘటన ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అమెరికా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 350 మీడియా సంస్థలు ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యల్ని ఖండిస్తూ సంపాదకీయాలను ప్రచురించాయి.
ట్రంప్ 2016లో బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తనకు వ్యతిరేక వార్తలు రాసే మీడియా సంస్థలను లక్ష్యంగా చేసుకున్నారు. ఇటీవల ఆయన కొన్ని మీడియా సంస్థలను అమెరికా ప్రజలకు శత్రువులుగా అభివర్ణించారు. అంతేకాకుండా గతంలో ఓ ఇబ్బందికరమైన ప్రశ్న అడిగినందుకు సీఎన్‌ఎన్ చానల్ రిపోర్టర్‌ను ఇటీవల జరిగిన పత్రికా సమావేశానికి హాజరుకాకుండా నిషేధం విధించారు. ఈ నేపథ్యంలో ట్రంప్ చర్యలు, వ్యాఖ్యలను నిరసిస్తూ సంపాదకీయాలు రాయాలని బోస్టన్ గ్లోబ్ పత్రిక పిలుపునిచ్చింది. తమకు నచ్చినట్లు రాతలు రాయని పత్రికలపై దేశానికి శత్రువులుగా ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ ముద్రవేస్తున్నారని బోస్టన్ గ్లోబ్ పత్రిక తన సంపాదకీయంలో విమర్శించింది. తమకు నచ్చని వార్తల్ని నకిలీ కథనాలుగా ప్రచారం చేయడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని న్యూయార్క్ టైమ్స్ సంపాదకీయాన్ని ప్రచురించింది.
న్యూయార్క్ పోస్ట్ స్పందిస్తూ.. ప్రభుత్వానికి ఇబ్బందికరమైన వార్తలను పత్రికలు ప్రచురించినంత మాత్రన అవి నకిలీ వార్తలు అవిపోవని సంపాదకీయం రాసింది. ప్రతీకారం, వేధింపులు, శిక్షల నుంచి మీడియాకు స్వేచ్ఛ లేకపోతే.. ఆ దేశానికి, అక్కడి ప్రజలకు కూడా స్వేచ్ఛ లేనట్లేనని ఫిలడెల్ఫియా ఇన్‌క్వైరర్ సంపాదకీయం ప్రచురించింది. అయితే కొంత మంది మాత్రం మీడియాకు స్వేచ్చ ఉన్నట్లే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు కూడా తన అభిప్రాయాలు స్వేచ్చగా చెప్పుకునే హక్కు ఉంటుంది కదా అని వ్యాఖ్యానిస్తున్నారు.